న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోనా వ్యాప్తికి విపక్షాలే కారణం అని ప్రధాని మోదీ లోక్‌సభ వేదికగా ఆరోపణలు చేశారు. మొదటి వేవ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులను దాటి పెద్ద పాపం చేసిందని పేర్కొన్నారు. వలస కూలీలు ముంబై నగరాన్ని వదిలి వెళ్లేలా చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలకు వైరస్ పాకేలా చేసిందని అన్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని మోదీ అన్నారు. లాక్డౌన్ అమల్లో ఉండగా, బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను రాష్ర్టాలకు తరలించిందని, వీళ్ల పాపం వల్లే బీహార్, పంజాబ్, యూపీలకు కరోనా మహమ్మారి పాకిందని అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ విపక్షాలకు సమాధానం ఇస్తూ ఈ ఆరోపణలు చేశారు. తుక్డే తుక్డే గ్యాంగ్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నదని, విభజన మనస్తత్వం వారి డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు.

వలస కార్మికులకు కేసీఆర్ అండ: కవిత
దేశంలో ఉన్నపళంగా లాక్డౌన్ విధించి లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను అగమ్యగోచరంగా మార్చింది కేంద్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లాక్డౌన్ నిర్ణయంతో యావత్ దేశం తీవ్రమైన షాక్, గందరగోళ పరిస్థితిల్లోకి వెళ్లిపోయిందని ఆమె తెలిపారు. అయితే కేంద్రం పట్టించుకోకుండా వదిలేసిన వలస కార్మికుల దీనావస్థను అర్థం చేసుకొన్న సీఎం కేసీఆర్ వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు.
‘మోదీ గారు.. కరోనా వ్యాప్తికి విపక్షాలే కారణం అన్న మీ వ్యాఖ్యలు తెలంగాణలోని విపక్షాలకు కూడా వర్తిస్తాయా’
– ఓ నెటిజన్ ప్రశ్న