న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ప్రతిపక్షాల నిరసనలతో తొలి రోజు సోమవారం పార్లమెంట్ అట్టుడికింది. లోక్‌సభ పలుసార్లు వాయిదా పడగా రాజ్యసభలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. సర్‌పై చర్చ జరగాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టగా చర్చకు తాము వ్యతిరేకం కాదని, కాని కాలపట్టికను ప్రకటించలేమని ప్రభుత్వం స్పష్టంచేసింది. అవాంతరాల మధ్య లోక్‌సభలో రెండు కొత్త బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. పొగాకు, పాన్ మసాలా, సంబంధిత ఉత్పత్తులపై లెవీలను విధించడానికి ఉద్దేశించిన ఈ బిల్లులను ఆమె ప్రవేశపెట్టారు. సర్ లేదా ఎన్నికల సంస్కరణలపై వెంటనే సభలో చర్చ జరపాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పదేపదే డిమాండు చేయడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వారికి జవాబిస్తూ చర్చకు తాము వ్యతిరేకం కానప్పటికీ చర్చ ఎప్పుడు జరపాలో ప్రతిపక్షం నిర్దేశించకూడదని స్పష్టం చేశారు.
మంత్రి స్పందనపై అసంతృప్తి తెలుపుతూ పలువురు విపక్ష సభ్యుల సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, సర్‌పై చర్చతోసహా అనేక అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన తొమ్మిది నోటీసులను రాజ్యసభ చైర్పర్సన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. దీనిపై విపక్ష సభ్యులు తమ నిరసన తెలియచేశారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఓ శునకాన్ని తన కారులో పార్లమెంట్‌లోకి తీసుకురావడం తీవ్ర వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎంపీ నాటకాలు వేస్తున్నారంటూ పాలకపక్ష ఎంపీలు ఆరోపించగా పార్లమెంట్ లోపల కూర్చున్నవారు కరుస్తారు. కుక్కలు కాదు అంటూ రేణుకా చౌదరి వారికి సమాధానమివ్వడం వాగ్యుద్ధానికి దారితీసింది. లోక్‌సభలో సైతం సర్‌పై చర్చకు డిమాండు చేస్తూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. రెండుసార్లు వాయిదాపడిన లోక్‌సభ చివరిగా మధ్యాహ్నం 2.20 గంటలకు మూడవసారి రేపటికి వాయిదా పడింది. అంతకుముందు జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు కోసం జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ప్రవేశపెట్టిన మణిపూర్ జీఎస్టీ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
పార్లమెంట్ గోదా కాదు: మోదీ
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద విలేకరులతో మాట్లాడిన ప్రధాని మోదీ విపక్ష సభ్యుల తీరుపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఎన్నికలకు సన్నాహకంగానో లేక ఎన్నికల్లో ఓటమి తర్వాత తమ నిస్పృహను బయటకు కక్కడానికో పార్లమెంట్‌ను గోదాగా మార్చుకునేందుకు విపక్షం ప్రయత్నిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. రాజకీయాలలో సానుకూల వాతావరణాన్ని ఎలా తీసుకురావచ్చో తన దగ్గరకు వస్తే సలహాలు ఇస్తానని విపక్ష సభ్యులకు ఆయన చురకలు అంటించారు. నాటకాలు ఆడేందుకు పార్లమెంట్ వేదిక కాదన్నారు.
జీపీఎస్ స్పూఫింగ్ నిజమే: కేంద్రం
ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనికి జీపీఎస్ స్పూఫింగ్ కారణమని వార్తలు వెలువడ్డాయి. దీనిపై కేంద్రం స్పందించింది. ఈ స్పూఫింగ్ నిజమేనని, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మార్చేందుకు ప్రయత్నాలు జరిగాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.