
మనలో చాలా మందికి ఇతరులకు సేవ చేయాలనే మంచి మనసు ఉంటుంది. కానీ అందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించవు. చాలీచాలని వేతనాలతో మనం బతకడమే కష్టమనుకుంటే.. ఇంకా ఇతరులకు సేవ ఎలా చేసేది అని మదనపడుతుంటారు. కానీ సేవ చేయడానికి డబ్బులు లేకున్నా.. మంచి మనసుతో సమయం ఇస్తే చాలు.. అంటోంది రాబిన్ హుడ్ ఆర్మీ. ఇదే స్ఫూర్తితో వినూత్నంగా ఆలోచించి ఓ తండ్రి కొడుకులు సమయం దొరికినప్పుడల్లా రాబిన్ హుడ్ ఆర్మీ సభ్యులుగా పేదల బస్తీలు, గరీబోళ్ల అడ్డాల్లో ప్రత్యక్షమవుతున్నారు. సెలవు రోజులు, వీకెండ్స్ కార్యకలపాలను విశ్లేషించుకుని ఏ మాత్రం సమయం దొరికినా స్నేహితులతో కలిసి బస్తీల్లోని పేదలు, పిల్లల మోముల్లో చిరునవ్వులు కనిపించేలా చేస్తున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ ప్రాంతానికి చెందిన సునీల్ ఓ ఫార్మా కంపెనిలో ఉన్నత స్థాయి ఉద్యోగి. ప్రతి రోజు బిజీ బిజీగా ఉండే అతనికి ఇతరులకు సహాయం చేయాలనే కోరిక ఉండేది. ఇందుకు కోసం ఆయన తాను చదువుకున్న పాఠశాలలో ప్రతి ఏటా ఇద్దరు పేద విద్యార్థులకు ఫీజు చెల్లిస్తూ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు అందించేవాడు. అయితే ఆ సాయం ఆయనకు పెద్దగా తృప్తిని ఇవ్వలేదు. మరికొంత మందికి సాయం చేయాలనే ఉత్సాహం ఉండేది. అయితే అందుకు తన ఆర్థికస్థోమత సరిపోయేది కాదు. అలా మదనపడుతున్న సమయంలోనే అతనికి స్నేహితుల ద్వారా రాబిన్‌హుడ్ ఆర్మీ గురించి తెలిసింది.
రాబిన్‌హుడ్ ఆర్మీ..
ఇది ఎలాంటి కార్యాలయం లేకుండా… హంగు ఆర్భాటం లేని, చారిటీ పేరుతో ఆర్థిక పరమైన వసూలు చేయని ఓ వేదిక. శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లు, హోటళ్లలో మిగిలిన భోజనాన్ని సేకరించి వాటిని అవసరం ఉన్న వారికి అందించడం ఇందులో సభ్యులు చేసే పని. ఆలస్యం చేయకుండా సునీల్ అందులో సభ్యుడిగా చేరాడు.
పాలు.. బిస్కెట్.. ఆహారం..
ఇలా సునీల్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ ఐటీ కారిడార్ ప్రాంతాలకు చెందిన గ్రూపులో రాబిన్‌హుడ్ ఆర్మీగా చేరాడు. ఆ గ్రూపులో ఎవరైనా ఫలానా కన్వెన్షన్, హోటల్, ఫంక్షన్ హాలులో భోజనం ఉందని చెప్పగానే వాటిని సేకరించుకుని ఆ ప్యాకెట్లను పేదల బస్తీలు, నిర్మాణ సంస్థలు, గుడిసెలు, ఇంకా పాఠశాలల వద్ద వెళ్లి అందిస్తాడు. శనివారం మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌వాసులు తమ వంతుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాలు అందించాలని నిర్ణయించుకున్నారు. వారికి వచ్చి ఇచ్చే సమయం లేకపోవడంతో రాబిన్‌హుడ్ చాప్టర్లో మెసేజ్ తెలుసుకుని, సునీల్ తన కొడుకు సంప్రీత్, ఇద్దరు స్నేహితులు సంకీర్త్, అభిషేక్‌లతో కలిసి వెళ్లి మాదాపూర్ జిల్లా పరిషత్ స్కూల్లోని దాదాపు 200 మందికి బిస్కెట్ ప్యాకెట్లు, పాలను అందించారుఅందించారు. ఇలా సమయం చిక్కినప్పుడల్లా ఇతరుల సహాయం చేస్తూ మానసిక సంతృప్తిని పొందుతున్నారు.
నాన్నే ప్రేరణ
మా నాన్న 300 మందికి ఆహార పొట్లాలను అందించి వచ్చి ఇంట్లో వాటిని వివరిస్తూ పొందే ఆనందం నాకు ప్రేరణగా నిలిచింది. సేవ చేస్తే ఇంత సంతోషం ఉంటుందా అని ఓ సారి నేను కూడా వెళ్లా. కొంత మంది పేద పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు ఇచ్చినప్పుడు వారు మురిసిపోయి తినే ఆనందం నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది.
వెలకట్టలేని సంతృప్తి
నేను ఆర్థికంగా భారీగా ఖర్చు పెట్టి సేవ చేయలేను. అలాగని పది మందికి సహాయపడాలనే ఆలోచనను చంపుకోను. ఇలా ఆలోచిస్తున్న సమయంలో రాబిన్ హుడ్ గురించి తెలిసింది. అందులో చేరి నా వంతుగా అవసరం ఉన్న వారి దగ్గరకు వెళ్లి దానం చేసే వారి సామగ్రిని అందిస్తున్నాను. ఆ సమయంలో అన్నార్తుల కండ్లలో కనిపించే ఆనందం నాకు వెలకట్టలేని సంతృప్తిని ఇస్తుంది.