(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ముందుండి నడిపించడంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్‌లో భాగంగా త్రివిధ దళాల మధ్య సమన్వయం ఏర్పాటు చేయడమే కాకుండా ఆపరేషన్ పూర్తయ్యాక విదేశీ ప్రతినిధుల నుంచి వచ్చే దౌత్యపరమైన ప్రశ్నలను నివృత్తి చేస్తూ వారి మద్దతును కూడగట్టడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.
గత నెల 22న కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి ఘటన జరిగిన క్షణం నుంచి భద్రతాపరమైన చర్యలను పర్యవేక్షించడంతో పాటు ఉగ్రమూకల ఆటకట్టించడానికి అవసరమైన పథకాలు రచించడంలోనూ దోవల్ ముఖ్య భూమిక పోషించారు. ఉగ్ర శిబిరాలపై దాడి చేయడానికి ఒకరోజు ముందు ప్రధాని మోదీతో దోవల్ రెండుసార్లు భేటీ అయ్యారు. ఒక్కో భేటీలో గరిష్ఠంగా 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు సమావేశాల్లోనే ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన నిర్ణయం జరిగి ఉండొచ్చని సమాచారం. బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన మాక్ సెక్యూరిటీ డ్రిల్స్‌ను కూడా దోవల్ పర్యవేక్షించారు.
ఆపరేషన్ సిందూర్ తీరుతెన్నులను, ఏ పరిస్థితుల్లో ఈ ఆపరేషన్‌ను చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని విదేశీ ప్రతినిధులకు, ఆయా దేశాల భద్రతా సలహాదారులకు, కార్యదర్శులకు వివరించడంలో దోవల్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రతినిధులు భారత్ చర్యలను సమర్థించాయి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందేనని ప్రకటించాయి. మరోవైపు, ఉగ్ర శిబిరాలపై మాత్రమే తాము దాడులు చేశామని.. పాక్ ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని అజిత్ దోవల్ ప్రత్యేకంగా వివరించారు.
దీనికి అవసరమైన రుజువులను మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ద్వారా ప్రదర్శించేలా చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికల మీద దాయాది దేశం భారత్‌ను దోషిగా చిత్రీకరించే కుట్రలకు చెక్ పెట్టేలా చేశారు. ఇదే సమయంలో ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదన్న దోవల్.. పరిస్థితులను తీవ్రతరం చేసేలా పాక్ వ్యవహరిస్తే.. భారత్ నుంచి ప్రతిస్పందన మరింత గట్టిగా ఉంటుందని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
2019లో పుల్వామా దాడుల అనంతరం నిర్వహించిన బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ ఆపరేషన్‌లోనూ దోవల్ కీలక పాత్ర పోషించారు. 1988లో ఇరాక్‌లో చిక్కుకొన్న 46 మంది భారత పౌరులను రక్షించడానికి నిర్వహించిన ఆపరేషన్ బ్లాక్ థండర్, 2015లో మయన్మార్ సరిహద్దుల్లో చేపట్టిన ఆపరేషన్ హాట్ పర్స్యూట్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. పాకిస్థాన్‌లో ఏడాదిపాటు గూఢచారిగా ఉంటూ దోవల్ భారత్‌కు విలువైన సమాచారాన్ని చేరవేశారు.