కిడ్నాపైన వారిలో మిగిలిన ఇద్దరి పిల్లలను రక్షించాలన్న దృఢ నిశ్చయంతో సైకో చెప్పినట్టే హుస్సేన్‌సాగర్‌కు బయల్దేరాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి.. సైకో గురించి ప్రస్తావించాడు. ‘సార్.. ఆ సైకో మీకు ముందే తెలుసా? వాడి మాటలను బట్టి మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉన్నట్టు అర్థమవుతున్నది. అసలేం జరిగింది సార్..?’ అంటూ లాలనగా అడిగాడు.
‘బాబాయ్.. ఆ సైకోను పదేండ్ల వయసున్నప్పుడు ఓసారి కలిశా. అతని పేరు రవి. టూర్లో భాగంగా మా స్కూల్ వాళ్లతో షామీర్పేట చెరువుకు వచ్చా. కట్ట కింద అందరం ఆటలాడుతున్నాం. అప్పుడే ఈ రవి నా దగ్గరకొచ్చాడు. మాట కలిపాడు. సూరారంలో ఉంటామని చెప్పాడు. మీది ఏ స్కూల్ అని నేను అడిగితే.. తాను చదువుకోవట్లేదని, పనికి పోతానని అన్నాడు. తోటలో మామిడిపండ్లను తెంపే పనికి అవ్వ, అయ్యతో తాను కూడా వచ్చినట్టు చెప్పాడు. వాడు మామిడిపండ్ల ముచ్చట తీయగానే నాకు నోరూరింది. అదే విషయం వాడికి చెప్పా. చెట్టెక్కి వాడు మామిడి పండ్లను తెంపుతుంటే.. నేను కిందనుంచి రాళ్లతో పండ్లను కొట్టా. అలా దొరికిన మామిడిపండ్లను ఇద్దరం తిన్నాం.
స్కూల్‌కు వెళ్తే మంచిబుద్ధులు వస్తాయని, పంచతంత్రం వంటి కథలు ఎంతో చక్కగా ఉంటాయని నేను వాడికి హితబోధ చేశా. అయితే, తనకు చదువుకొనే స్తోమత లేదని వాడు చెప్పాడు. ఇలా మా మాటలు కొనసాగుతుండగానే.. తల పగిలి రక్తం కారుతున్న నా ఫ్రెండ్‌ను తీసుకొని మా సార్ మా దగ్గరకొచ్చాడు. రాళ్లతో కొట్టింది ఎవరని అడిగాడు. అయితే, నేను భయపడిపోయి.. రవి పేరు చెప్పా. కట్టమైసమ్మను సాక్షిని చేస్తూ అప్పటికప్పుడు తప్పించుకొన్నా.. అప్పుడే వాడు.. ‘అదిగో పండు అన్నవాడు ఆ పండును తెంపడు. అనని వాడు మాత్రం పండును తెంపుతాడు. తెంపినోడు తినడు.
తెంపనివాడు తింటాడు. పండు తిన్నవాడిని కొట్టరు. పండు తినని వాడిని కొడతారు. ఇంతకీ తిన్నవాడెవ్వడు? తన్నులు తిన్నవాడెవ్వడు?’ అంటూ గట్టిగా అరిచాడు. గొడవ జరుగుతుందని తెలిసి.. అక్కడికి వచ్చిన రవి తల్లిదండ్రులు విషయం తెలుసుకొని వాడినే కొట్టారు. ఇంతలో కొందరు కలుగజేసుకొని ‘పనోడి కొడుకు ఇలా కాకపోతే ఇంకా ఎలా ఉంటాడు? అయినా గొప్పింట్లోనే మంచి పిల్లలు పుడతారు. వారి గురించే అందరూ పదికాలాలపాటు చెప్పుకొంటారు’ అంటూ అందరూ రవినే తిట్టారు. తన తప్పేమీలేదని వాడు ఎంతమొత్తుకొన్నా ఎవ్వరూ వినలేదు. దీంతో వాడు నాపై కోపం పెంచుకొన్నాడు.
పనోడి కొడుకైనా సరే.. నా కంటే గొప్పవాడు కావాలన్న కసితో వాడు కష్టపడి చదివాడు. ఎథికల్ హ్యాకర్ అయ్యాడని విన్నా. అయితే, బిజీ లైఫ్‌లో పడి వాడి గురించే మరిచిపోయా. కానీ, నా మీదున్న ద్వేషం వాడిని ఇలా సైకోగా మారుస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. పసిప్రాయంలో జరిగే చిన్న పొరపాట్లు కూడా ఇంత పెద్ద నిర్ణయాలకు దారితీస్తాయని తొలిసారిగా చూస్తున్నా’ అంటూ చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు రుద్ర. ‘సార్.. చిన్నతనంలో ఏదో జరిగిపోయింది. వాడు దాన్ని మనసులో పెట్టుకొన్నాడు. అయితే, మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకొని వాడు తప్పుడు దారిని ఎంచుకొన్నది. మీ మీద కసి తీర్చుకోవాలన్న వాడి లక్ష్యం.. చివరకు పసిపిల్లలను బలిపెట్టే వరకూ వెళ్లింది. అది తప్పు’ అంటున్న రామస్వామి మాటలతో ఏకీభవిస్తున్నట్టు తలూపాడు రుద్ర.
ఇంతలో రుద్ర మొబైల్ మోగింది. ‘ఏం రుద్రా.. నీ చిన్నప్పటి బాగోతం అంతా ఆ ముసలోడితో చెప్పుకొన్నావా? అయినా.. నీపై నాకు కోపం ఎప్పుడొచ్చిందో తెలుసా? ఎథికల్ హ్యాకర్‌గా నేను కేంబ్రిడ్జి నుంచి బ్రిలియంట్ సర్టిఫికెట్ తీసుకొంటే.. ఎథికల్ హ్యాకర్ కూడా ఓ బ్రిలియంటేనా? అంటూ ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడు. దానికి నువ్వు లైక్ కొట్టావ్. అదీ నా ఇగోను హర్ట్ చేసింది. కేసులను ఇట్టే సాల్వ్ చేస్తున్న నిన్ను ముప్పుతిప్పలు పెట్టాలని అప్పుడే నిర్ణయించుకొన్నా.. నీ ఓటమిని చూడాలనుకొన్నా.. అందుకే, ఇదంతా. ఇక, ఈ గేమ్‌కు ఇక్కడితో ముగింపు పలుకుతున్నా. నేను అడిగే 5 ప్రశ్నలకు ఇంతకుముందులాగే.. 5 సెకండ్లలో ఆన్సర్ చెప్తే.. ఇద్దరు పిల్లలను వదిలేస్తా.. తప్పు చెప్పావో.. ఈ సారి పిల్లలను చంపను. నిన్ను చంపుతా. హుస్సేన్‌సాగర్‌కు వచ్చేయ్.. అన్నట్టు.. ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టడం మరిచిపోవద్దు’ అంటూ ఫోన్ కట్ చేశాడు రవి.
పావుగంటలో రుద్ర అండ్ టీమ్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. రవి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘హాయ్ రుద్రా.. మొదటి ప్రశ్న.. ఎక్కడైతే పుట్టిందో అక్కడికి పంపితే చస్తుంది.. ఏమిటది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్ ..’ రుద్ర సమాధానం చెప్పాడు. ‘రెండో ప్రశ్న.. రెండు సెకండ్లలో చవగ్గా ఓ పెద్ద గదిని మొత్తం నింపాలంటే ఏ మెటీరియల్ వాడతావ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్ ..’ వెంటనే రుద్ర సమాధానం చెప్పాడు. ‘మూడో ప్రశ్న.. అదో పండు.. దానికి పువ్వులు ఉంటాయి.. అయితే పూజకు పనికిరావు.. దానికి ఆకులు ఉంటాయి.. విస్తరిలా పనిచేయవు.. కానీ, ఆ పండు అందరికీ కావాలి.. అయినా దాన్ని పండులా మాత్రం తినరు.. ఏమిటి? ఫైవ్, ఫోర్, త్రీ..’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు.
‘వెల్డన్ రుద్రా.. మూడు ప్రశ్నలకు ఆన్సర్లు కరెక్ట్‌గా చెప్పావ్.. ఇక, నాకు ఈ గేమ్ బోర్ కొడుతున్నది.. మళ్లీ కలుస్తా.. పిల్లలు బుద్ధ స్టాట్యూ దగ్గర ఉన్నారు.. వెళ్లి తెచ్చుకో.. ఓకేనా? బాయ్.. అన్నట్టు 5 ప్రశ్నలు అని చెప్పా కదా.. మరి 3 ప్రశ్నలతోనే ఆపేశా అనుకొంటున్నావా.. అదేంలేదు.. నేను ఇప్పుడు చివరగా అన్న రెండు వర్డ్స్ ‘ఓకే’, ‘బాయ్’ ఫుల్‌ఫామ్ ఏంటో చెప్పు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.. ఫైవ్, ఫోర్, త్రీ&’ ఇంతలో రుద్ర సమాధానం చెప్పాడు. ‘గుడ్ రుద్రా.. కరెక్ట్‌గా చెప్పావ్.. ఈసారికి నీదే గెలుపు అనుకొంటున్నావా? లేదు.. నాది గెలుపు.. ఎందుకంటే.. ఓపెన్ యువర్ వాలెట్’ అంటూ రవి ఫోన్ కట్ చేశాడు.
వెంటనే బుద్ధ స్టాట్యూ దగ్గరికి వెళ్లిన రుద్ర.. మిగతా ఇద్దరి పిల్లలను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించాడు. ఇంతలో రామస్వామి.. ‘సార్.. మొత్తానికి మీరే గెలిచారు. పిల్లలను కాపాడారు. మీ టాలెంట్ సూపర్ సార్.. ఇంటర్నెట్లో కూడా అందరూ మీ గొప్పతనం గురించే కామెంట్లు చేస్తున్నారు’ అంటూ రుద్రను పొగిడాడు. ఇంతలో రవి చివరగా అన్న ‘ఓపెన్ యువర్ వాలెట్’ మాటలు రుద్రకు గుర్తొచ్చాయి. వెంటనే తన పర్సు ఓపెన్ చేశాడు. అందులో ఓ లెటర్ ఉంది. తెరిచాడు. ‘ఒరేయ్ రుద్రా.. ఈ మధ్యకాలంలో పుష్ప సినిమాలోని ఓ డైలాగ్ నన్ను బాగా ఎట్రాక్ట్ చేసింది.
‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకొంటే వదిలేస్తా సిండికేట్’.. ఇన్నిరోజుల నుంచి నీ చుట్టే నేను ఉన్నప్పటికీ ఎవ్వడూ నన్ను పట్టుకోలే.. మరి నువ్వు గెలిచావని అంటాడేంటి ఆ ముసలోడు? నీకు దొరక్కుండా ఇంత గేమ్ ఆడినందుకు నేను గెలిచినట్టు కదా..! ఇప్పుడు నేను నీకు సవాల్ విసురుతున్నారా.. రుద్ర.. ‘దమ్ముంటే పట్టుకోరా రుద్ర.. పట్టుకొంటే వదిలేస్తా నీ డొక్కు ఫ్యామిలీ సిండికేట్’ అని ఆ లెటర్లో రాసి ఉంది. దీంతో నిర్ఘాంతపోయిన రుద్ర.. ఏం జరుగుతుందోనన్న భయంతో రాకెట్ వేగంతో ఇంటికి బయల్దేరాడు. అది పక్కనపెడితే.. సైకో అడిగిన 5 ప్రశ్నలకు సమాధానాలను కనిపెట్టారా?
మొదటి సమాధానం: ఉప్పు, రెండో సమాధానం: దీపం, మూడో సమాధానం: చింతపండు, నాలుగో సమాధానం: ఓకే ఫుల్‌ఫామ్.. అబ్జెక్షన్ కిల్డ్, ఐదో సమాధానం: బాయ్ ఫుల్‌ఫామ్ బీ విత్ యూ ఎవ్రీ టైమ్.