న్యూఢిల్లీ, నవంబర్ 17: భారతదేశంలో చిన్నపిల్లలపై ఆన్లైన్లో లైంగిక వేధింపులు విపరీతంగా పెరుగుతున్నాయని ఇంటర్పోల్ తన నివేదికలో పేర్కొన్నది. గడిచిన మూడేండ్లలో (2017-2020) భారత్లో 24 లక్షల కేసులు నమోదు అయినట్టు తెలిపింది. బాధితుల్లో 80% మంది 14 ఏండ్ల లోపు బాలికలే. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, వాటి వినియోగదారులు వేగంగా పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే ఒక సెర్చింజన్లో చైల్డ్ పోర్నోగ్రఫీ కోసం 1.16 లక్షల మంది వెతికారని, దీన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవచ్చని హెచ్చరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగిక వేధింపులపై సీబీఐ ఇటీవల దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సీబీఐ ప్రత్యేకంగా 14 రాష్ర్టాల్లో సోదాలు చేసి ఏడుగురిని అరెస్టు చేసింది.