సంప్రదాయ సాగుకు రైతులు స్వస్తి పలికి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు మళ్లుతున్నారు. వరి కంటే తక్కువ పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. ఏడాదిలో అన్ని ఖర్చులు పోను అర ఎకరాకు సుమారు రూ. 40వేలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్రుతండాకు చెందిన రైతు జాటోత్ సీతారాంనాయక్. ఇలా మండలంలోని రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు.
నర్సింహులపేట, నవంబర్ 29ఎర్ర చకృతండాకు చెందిన జాటోతు సీతారాంనాయక్ తనకు ఉన్న ఐదెకరాల్లో మిరప, పత్తితో పాటు వరి సాగు చేసేవాడు. ఎక్కువ పెట్టుబడి, కష్టపడినా వరి పంటకు దిగుబడి రాలేదు. దీంతో మూడేళ్లుగా అర ఎకరంలో ఉల్లి సాగు చేస్తూ, ఏడాదిలో రెండు పంటలు పండిస్తున్నాడు. అర ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో ధర ఎక్కువే ఉంది. ఎప్పుడు అమ్మినా కిలోకు రూ. 25 నుంచి 30 వరకు అమ్ముతున్నాడు. ఒక పంటకు అన్ని ఖర్చులు పోను రూ. 20 వేల నుంచి 25 వేల వరకు ఆదాయం వస్తున్నది. అంటే ఏడాదిలో అర ఎకరానికి రూ. 40 వేలకు పైగా ఆదాయం వస్తుందని చెబుతున్నాడు.
దున్నకం రూ.3000
ఉల్లి విత్తనం(2కిలోలు) రూ.9000(2కేజీ)
కలుపు కూలీలకు రూ.4000
దుక్కిమందు బస్తా రూ.1200
ఉల్లి తీసేందుకు కూలీలకు రూ.2000
మొత్తం ఖర్చు రూ.19200
ఎకరానికి దిగుబడి 20 నుంచి 30 క్వింటాళ్లు. ధర సుమారు రూ.25 నుంచి 30 వరకు ఉంటుంది. సగటున ఎకరానికి 25 క్వింటాళ్లకు రూ.25 చొప్పున రూ.62,500 ఆదాయం వస్తుంది. దీనిలో 19,200 ఖర్చులు పోను సుమారు రూ.40,800 వరకు ఆర్జించవచ్చు. అంటే రెండు పంటలకు రూ. 80వేలకు పైగా ఆదాయం సమకూరుతుంది.