న్యూఢిల్లీ : త్వరలోనే ‘ఒకే రాష్ట్రం-ఒకే ఆర్ఆర్బీ’ విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేయనుంది. సమర్థ నిర్వహణ, ఖర్చుల హేతుబద్ధీకరణ, 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల ఏకీకరణ కోసం ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపింది. ఏకీకరణకు సంబంధించి చాలావరకు పని పూర్తయ్యిందని, దీనికి సంబంధించి నాలుగో విడత కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, యూపీలో 3, బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో రెండేసి చొప్పున ఆర్ఆర్బీలు ఉన్నాయి. ఆర్థిక శాఖ రోడ్‌మ్యాప్ ప్రకారం వీటిలో 15 ఆర్ఆర్బీలను విలీనం చేస్తారు. ఇక తెలంగాణ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివాదం ముగిసిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో 50 శాతం వాటా రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉండగా, 35% సంబంధిత స్పాన్సర్డ్ బ్యాంక్‌లు, 15 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి.