ఈ జన్మమే రుచి చూడటానికి దొరికెరా.. అంటాడో కవి. వేడి పాయసం ఎప్పటికప్పుడే అని మరో కవి ఉవాచ. శ్రీరమణ గారి మిథునం అప్పదాసును తలుచుకోండి… చటుక్కున దప్పళం గుర్తొచ్చేస్తుంది. శంకరమంచి వారి భోజన చక్రవర్తిని స్మరించుకోండి.. డజన్ల కొద్దీ దహీవడలు దవడల కింద మెత్తగా నలిగిపోవాల్సిందే! ఆ మాటకొస్తే.. హైదరాబాదీ ధమ్ బిర్యానీ వాసన ఊహించుకోండి… ‘తియ్యండ్రా బండ్లు..’ అని ప్యారడైజ్ బాట పట్టేస్తాం. అలాగని, ఏది కనిపిస్తే అది తినేస్తే.. ఆరోగ్యానికే కాదు, మీలోని జీవుడికీ ద్రోహం చేసినట్టే! ‘అతడు’ సినిమాలో ‘ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా శ్రద్ధగా, పద్ధతిగా కొట్టాడురా’ అని హీరో ఫైటింగ్ స్టయిల్ని సంభ్రమంగా చెబుతుంది భరణి పాత్ర. తినడం కూడా అంతటి కళే!
ఏది పడితే అది.. ఏ కాంబినేషన్‌తో పడితే ఆ కాంబినేషన్‌తో లాగించేస్తే… ఆ పూటకు కడుపు నిండుతుందేమో కానీ, పొట్టపూజలో క్రియాహీనం జరిగిపోతుంది. నమ్మిన దైవానికి షోడశోపచార పూజ ఎంత శ్రద్ధగా చేస్తామో.. మన జఠరంలో కొలువై ఉండే జీవాగ్నికి అంత ప్రేమగా రుచికరమైన హవిస్సులు సమర్పించుకోవాలి.
జిహ్వ మీదుండే రుచి మొగ్గలు పిల్లిమొగ్గలు వేసేలా.. పాకాన్ని ఆస్వాదిస్తూ తినాలి. ఈ క్రమంలోకొన్ని కాంబినేషన్లు మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు. చేయి తిరిగిన పాకయాజులు గానీ చేశారో.. వాటిని ఓ పట్టుపట్టాల్సిందే! ఆ కాంబోలు ఏమిటో, ఎలా ఆస్వాదించాలో ఒకసారి తలుచుకుంటే చాలు.. అంతరంగాన ఆత్మారాముడు.. అనంత విధాలుగా పొంగిపోవడం ఖాయం.
రుచికరమైన ఆహారం దొరకడం ఈ రోజుల్లో పెద్ద వ్యవహారం కాదు. ఉడుపి సందర్శినులు, ఫుడ్ ట్రక్లు, బాబాయ్ హోటళ్లు, పంచెకట్టు దోశెలు, ఆహా టిఫిన్లు, రామేశ్వరం కేఫ్‌లు.. అబ్బో ఎన్నో దారికాచి రుచి దోచిపొమ్మంటున్నాయి. ఇంటి పట్టున ఉన్నా.. స్విగ్గీ తగ్గేదే లేదంటున్నది. జొమాటో మాటేసే ఉంటున్నది. ఎంత హైజీన్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకున్నా.. పూటకూళ్ల తిండేగా! ఇవేవీ ఇంట్లో అమ్మ వండిన ముద్దపప్పు రుచికి సరిపోలవు. మనసు పెట్టి స్వయం పాకం చేసుకున్నా.. ముచ్చటైన రుచిని సొంతం చేసుకోవచ్చు. ఏం వండామన్నది కాదన్నయ్యా.. ఏ కాంబినేషన్‌తో ఏం లాగిస్తున్నామన్నది ఇంపార్టెంట్ ఇక్కడ! కొన్ని పదార్థాలను మధ్యవేలితో తీసి.. జిహ్వ మధ్యంలో తిలకం దిద్దాలి. ఇంకొన్ని వెరైటీలను మునిపంటితో కొరికి.. కొసకంటా నమిలి మింగాలి. ముద్దను చేతుల్లో ఆడించి నోట్లోకి విసురుకొని నోటితో క్యాచ్ అందుకునే పదార్థాలూ ఉంటాయి. నాలుగు వేళ్లు నోట్లోకి పోనిచ్చి.. జర్రున జుర్రుకునే పద్ధతీ భేషైనదే! ఇలా రకరకాల పాకాలను విధవిధాలుగా తింటూ ప్రతి వాయనూ ఓ వాయనంగా వినమ్రంగా స్వీకరించాలి. తగిన కాంబినేషన్స్ ఎంచుకొని ‘కలిపి తింటే.. కలదు సుఖమూ’ అనకుండా ఉండలేం!!

ముద్దపప్పు ముందు పుట్టిందా, ఆవకాయ ముందు పుట్టిందా.. అంటే పప్పుదే పైచేయి అవుతుంది. ఎందుకంటే.. మిరపకాయలు మనదేశానికి పరిచయం కాకముందే మన చేలల్లో పప్పుధాన్యాలు రాశులుగా పండేవి. శాకాహారులకు మాంసకృతులు దండిగా అందించే పప్పులు ఉడకని ఇల్లు ఉండదు. ఇక ఆవకాయ విషయానికి వద్దాం! అన్నప్రాశన నాడు కూడా ఆవకాయ రుచి చూసే ఘనత మనది! ఈ రెండిటినీ జోడీ కట్టి ఆరగిస్తే ఉంటుంది మాస్టారూ.. నరం లేని నాల్క ప్ట్ఁఁ అంటూ ఆదితాళం వేస్తుంది! ఇక్కడ ముద్దపప్పు అంటే చప్పటి పప్పే! ముందుగా వేడి వేడి అన్నం రెండు వాయల పరిమాణం కంచంలో రాసిగా వడ్డించుకోవాలి. ఆపై ముద్దపప్పు పెద్ద గంటెతో అయితే రెండుకు తక్కువ కాకుండా వేసుకోవాలి. అటు తర్వాత నెయ్యి వెయ్యొద్దు.. పొయ్యాలి! కాస్త పైపైన కలిపాక పసుపు వన్నెలోకి మారిన అన్నపూర్ణకు కుంకుమ బొట్టు పెట్టినట్టు… ఎర్రెర్రని తొక్కు రెండు ముక్కలు వేయాలి.
ఒంట్లోని శక్తినంతా వేళ్లలోకి రానిచ్చి… నాలుగైదు సార్లు బాగా పిసికి అన్నం కలుపుకోవాలి. ‘ఎవరో చూస్తారని.. ఏదో అనుకుంటారని…’ పక్కచూపులు చూస్తూ మొహమాటపడితే.. కాంబినేషన్ అసలు రుచి కాకెత్తుకు పోతుంది సుమా! మీ అన్నం.. మీ పప్పు.. మీ ఆవకాయ! ఆకలి మీది! తినేది మీరు!! ఆవకాయలోని ప్రతి అణువూ… పప్పుతో మమేకం అవ్వాలి. పప్పు, అన్నం విడదీయరానంతగా కలిసిపోవాలి. అప్పుడే తినేయొద్దు. బాగా కలిపిన చేతిని కంచం అంచుకు లీలగా అదిమి కూల్‌గా వెనక్కి లాగాలి. అంచుకు అతుక్కుపోయిన పదార్థాన్ని చూపుడువేలితో తీసి.. అన్నం వాయకు అదనపు సొగసు వచ్చేవిధంగా అలంకరించాలి. ఇప్పుడు.. ఐదు వేళ్లలో పట్టేంత ముద్ద తీసుకొని, అందుకు తగ్గ పరిమాణంలో నోరు తెరిచి తొలి ముద్ద స్వీకరించాలి. అంతే! ఈ జీవితమే సఫలము అనిపించక మానదు. ఏండ్లుగా తపమొనరించిన జీవుడికి దేవుడు అనుగ్రహించినప్పుడు కలిగిన ఫీలింగ్ కన్నా రెట్టింపు అనుభూతి ఈ చిన్నపాటి సాధనకు వశమవుతుంది.

పల్లెటూరి ఆతిథ్యానికి, కమ్మని ఇంటి భోజనానికి కేరాఫ్ అడ్రస్.. నాటుకోడి పులుసు-జొన్నరొట్టె! తెలంగాణ పల్లె వంటల్లో అత్యంత ఆదరణ పొందిన, నోరూరించే అద్భుతమైన కాంబినేషన్ ఇదే! పల్లెల్లో నాటుకోళ్లు ఎక్కువగా పెంచుకుంటారు. చుట్టాలు వచ్చినా, పండుగలు-పబ్బాలైనా కోడిని కోసి, విందు ఇస్తారు. బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి మాంసం గట్టిగా, పీచుగా ఉంటుంది. అందుకే, దీన్ని ఎక్కువ సమయం ఉడికించాలి. రోట్లో నూరుకున్న గరం మసాలాలు, కొబ్బరి తురుము వేసి స్పైసీగా వండుకోవాలి. నూనె పైకి తేలేలా పులుసును మసలనివ్వాలి. అందులోనూ కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో వండితే.. ఆ నాటుకోడి పులుసు ఘాటు వాసనకు ముక్కు పుటాలు అదిరిపోవాల్సిందే!
ఆరోగ్యకరమైన జొన్నరొట్టె. పచ్చజొన్నల పిండిని, వేడినీళ్లతో ముద్దచేసి… వేళ్లతో ఒత్తిన రొట్టెను పెనం మీద దోరగా కాలుస్తుంటే.. వెలువడే పరిమళంలోనూ ఆరోగ్యం ఉందనిపిస్తుంది. అయితే జొన్నరొట్టెలు కాస్త గట్టిగానే ఉంటాయి. రొట్టె గట్టిగా ఉన్నా.. నాటుకోడి పులుసుతో కలిసిపోయి మెత్తబడుతుంది. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది. వేడివేడి జొన్నరొట్టెను తుంచి, ఘాటైన నాటుకోడి పులుసులో ముంచి తింటుంటే.. నాలుక చురుక్కుమనాల్సిందే! జిహ్వపై నిద్రావస్థలో ఉన్న టేస్ట్ బడ్స్ ఫ్రీబర్డ్స్లా ఫీలవ్వాల్సిందే! విందు-వినోదాలకే కాదు.. తెలంగాణ శ్రమజీవుల బలవర్ధకమైన ఆహారంగానూ ‘నాటుకోడి పులుసు-జొన్నరొట్టె’ ముందుంటుంది.

భాద్రపద మాసంలో తప్ప అంతగా మార్కెట్లో కనిపించదు చామకూర. ఒకవేళ కనిపించినా.. దీన్నేం చేసుకుంటామని చాలామంది ఈ కూరను అంతగా ఆదరించరు. కానీ, చామకూరతో చేసే వెరైటీలు పాకశాస్త్రంలో పేరెన్నికగన్నవి. వాటిలో ఒకటి చామకూర ముద్దపప్పు. ఒకపాలు కందిపప్పు, దాంట్లో సగపాలు శనగపప్పు వేసి చేస్తారీ పదార్థం. లేత చామకూరను సుతారంగా తరిగి, కాడలనూ సున్నితంగా కట్ చేసుకొని గట్టి ముద్దపప్పు చేసుకోవాలి. పులుపు కోసం చింతపండు, కారం కోసం పచ్చిమిర్చి ఎలాగూ వేసుకుంటాం. తిరగమోతలో శనగపప్పు, మినప్పప్పు కాస్త ఎక్కువగానే వేసుకోవాలి.
రుద్రాక్ష పరిమాణంలో ఇంగువా వేసుకోవాలి. ఆపై పచ్చిపులుసు చేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. మనం వెన్నతో నేర్చుకున్న విద్యేగా!! ఈ కాంబినేషన్ రుచి అంతా తినే విధానంలోనే ఉంటుంది. రెండు పద్ధతుల్లో దీన్ని లాగిస్తుంటారు. మొదటగా ముద్దపప్పు అన్నంలో బాగా కలిపి.. ఓ గిన్నెలో పచ్చిపులుసు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. వేళ్లు పచ్చిపులుసులో ముంచి.. వాటిని అన్నంపై ఉంచి, అవే వేళ్లను తగు ప్రమాణంలో ముద్దపప్పు కలిపిన అన్నాన్ని పైకెత్తి, నోటికి అందించాలి! చామకూర అరోమా, పచ్చిపులుసులోని తీపి, పులుపు రెండూ మిళితమై… జిహ్వకు కొత్త రుచిని, పొట్టకు సరికొత్త శోభనూ చేకూరుస్తాయి. ఇక రెండో పద్ధతిలో అన్నంలో పచ్చిపులుసు కలుపుకొని, ముద్దముద్దకూ ఇంత ముద్దపప్పు అద్దుకుంటూ లాగించడం! రెండూ ఆమోదయోగ్యమైనవే! ఎవరి తృప్తి వారికి ఆనందం కదా!!
మన భోజన పర్వంలో పప్పు, కూరలు, సాంబారు, పచ్చళ్లకు ఎంత ప్రాధాన్యం ఉందో.. పొడులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. కరివేపాకు పొడి, మెంతిపొడి, ఎల్లిపాయ కారం, ఉల్లిపాయ కారం.. ఇవన్నీ సీజనల్‌గా చేసుకోవడం, ఆరగింపు సేవలో తరించడం తరతరాలుగా వస్తున్న ఆచారమే! అందరికీ అంతగా తెలియని చినంగాకు ముచ్చట ఇప్పుడు చెప్పుకొందాం! దీనికే చెన్నంగాకు అని మరో నామం. వర్ష రుతువులో కొత్త ఆకులతో నవనవలాడే చినంగాకు మైదాకుకు పెద్దమ్మలా, కరివేపాకుకు కజిన్లా కనిపిస్తుంది. మావిచివురు రంగు రెబ్బలకు పద్ధతిగా అలంకరించినట్టున్న ముదురు ఆకుపచ్చ పత్రాలు.. బోలెడన్ని విటమిన్లకు నెలవు. రెబ్బ నుంచి కరివేపాకును దూసినట్టు.. చినంగాకునూ సుతారంగా తీసుకోవచ్చు.
ఈ ఆకులను బాగా కడిగి.. తడి పోయేలా ఆరనిచ్చి.. పొడి తయారీ ప్రక్రియ మొదలుపెడతారు. ముందుగా బాణట్లో తగిన మోతాదులో నూనె వేసి.. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, కొన్ని మెంతులు, కొద్దిగా ఆవాలు, ఏడెనిమిది ఎండు మిరపకాయలు రంగు మారేదాకా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఆరిన చినంగాకునూ బాణట్లో కొద్దిగా నూనె వేసి తడి పోయేంత వరకు కలియ కలపాలి. వీటన్నిటినీ మిక్సీలో వేసి, అర పిడికిలంత చింతపండును జతచేసి పొడి చేసుకోవడమే తరువాయి. ఆకుల్లో మనం గ్రహించలేని పరిమళం.. పొడిగా మారిన తర్వాత ఇల్లంతా చుట్టేస్తుంది. పక్కింటినీ పలకరిస్తుంది.
పొగలు కక్కే అన్నంపై ఈ పొడి వేసి.. కాసింత నెయ్యి వేసుకొని లాగిస్తే వివాహ భోజనంబు పాటలో ఈ పొడి ఎలా మిస్సయ్యిందబ్బా అని అనుకోకుండా ఉండలేం! నెయ్యి వెయ్యకుండా చినంగాకు పొడితో మెత్తగా కలిపిన అన్నాన్ని గోరువెచ్చని పాలతో సంప్రోక్షణ చేసి బాగా కలుపుతుంటే.. జఠరాగ్నిలోకి కుంభకర్ణుడి ఆవాహన జరిగిపోతుంది. చేతితో ముద్దలు ఉండలు చుట్టి.. నోట్లోకి విసురుకుంటూ తింటుంటే.. చూసేవాళ్లకు మళ్లీ మాయాబజార్లో ఘటోత్కచుడి ఘట్టం గుర్తుకొస్తుంది. అదన్నమాట చినంగాకు, పాల కాంబినేషన్ మహిమ!

శ్రీకృష్ణుడు వెన్నంతా దొంగిలించిన తర్వాత తల్లి ఎక్కడ తిడుతుందో అని రేపల్లెలోకి దౌడు తీసేవాడట. కన్నయ్యను ఇంటికి రప్పించే కిటుకు యశోదమ్మకు మాబాగా తెలుసు. వెన్న సేకరించిన తర్వాత చల్లలోకి ఆమె పోపు పెట్టేదట. ఇంకేముంది గోపికమ్మలతో కూడి దోబూచులాడుతున్న నవనీత చోరుడు ఆ వెంటనే ఇంటి ముందు వాలేవాడట! అలా ఉంటుంది వెన్న చల్లతో చేసే చల్లపులుసు. దీనిని చేయడం బహు తేలిక, అదే సమయంలో చాలా కష్టం కూడానూ! చల్ల కాస్త పులిసినా పాకయాగమంతా నిష్ఫలం అయిపోతుంది. చిలికిన చల్లను చలాకీగా చల్లపులుసుగా మార్చాలి. ఓపిక ఉండాలి.
పొయ్యి మీద బాణట్లో చల్లను సన్నని మంటపై పగలకుండా కలపాలి. చిటికెడు మెంతుల పొడి, చారెడు ధనియాల పొడి వేసి మరగనివ్వాలి. మరో చిన్న బాణట్లో పోపు దినుసులు చిటపటలాడనిచ్చి, నాలుగు పచ్చి మిరపకాయలు సగానికి చీరి వేయాలి. పోపు సెగమీద ఉన్నప్పుడే.. అమాంతం తీసి చల్లపులుసులో కుమ్మరించాలి. క్షీరసాగర మథనమప్పుడు ఎంత కోలాహలంగా ఉందని పోతనామాత్యులు వర్ణించి చెప్పారో.. అలాంటి శబ్దం వంటింట జనించి, ఇల్లంతా వినిపిస్తుంది. ఈ చల్లపులుసును నేరుగా తింటే భలేగా ఉంటుంది. కానీ, టమాటా పప్పు అద్దుకుంటూ తింటే రంజుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.

ఇన్ని కాయగూరల వెరైటీల్లో, ఇన్నేసి ఆకుకూరల పదార్థాల్లో, నాన్‌వెజ్ వంటకాల్లో గొప్ప కాంబినేషన్లు ఇన్నేనా అని అసంతృప్తి వద్దు! ప్రయత్నం మానవ లక్షణం. రోటి పచ్చడి ఏదైనా సరే… పాలు కలుపుకొని తింటే అదనపు కమ్మదనం గ్యారెంటీ. ఆకుకూర పప్పులోకి చిక్కటి పాలు కలుపుకొని ఆరగించండి. ఇది కదా కాంబినేషన్ అనకుండా ఉండలేరు. చప్పటి పప్పులోకి మెంతిపొడి కలుపుకొని తిన్నా.. కొత్త రుచి సొంతం చేసుకోవచ్చు. చెప్తే నమ్మరు కానీ, గడ్డ పెరుగు అన్నంలోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపులుసు పోసుకొని తిన్నా, ఒక చెంచాడు చప్పటి పప్పు మెత్తగా పిసుక్కొని తిన్నా.. పరిపూర్ణ భోజనం చేసిన ఫీలింగ్ తథ్యం.
ఇక ఆవకాయ అన్నంలోకి పచ్చిపులుసు నంజుకుంటే.. ఆ కారానికి, ఈ తీపి తగిలి ముద్దముద్దకూ ‘ఆహా! ఓహో!’ అనకుండా ఉండలేం. ఆవకాయ ముద్దలోకి ఉల్లిగడ్డ ముక్క కొరుక్కుతింటే.. రాజసానికి, తామసం తోడవుతుంది. చద్దిబువ్వలో ఆవ దట్టించి, ఆపై చిక్కటి పాలు చిలకరించి, బాగా కలిపి.. ముద్ద ఎగిరేస్తూ నోటితో అందుకున్నప్పుడు మనసు స్వర్గానికి ఎగిరిపోతుంది. ఇదన్నమాట కాంబినేషన్ ఫుడ్ కహానీ! నచ్చిన కాంబినేషన్లు ట్రై చేయండి. కొత్త కాంబినేషన్లు సృష్టించండి. నలుగురికీ చెప్పండి.. వారి మెప్పునూ పొందండి!

తెలంగాణలో దావత్ అంటే బగారా బువ్వ-మటన్ కూర ఉండాల్సిందే! ఎంతపెద్ద విందైనా.. ఈ కాంబినేషన్ లేకపోతే అసంపూర్ణమే! ఇక బోనాల పండుగ అంటే చెప్పాల్సిన పనేలేదు. బంధుమిత్రులకు బగారా-మటన్‌తో విందు ఇవ్వాల్సిందే. నిజానికి హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అయినప్పటికీ, తెలంగాణ విందులలో బగారా-మటన్ కాంబినేషన్‌కే మొదటి ప్రాధాన్యం. పెద్దపెద్ద డెక్సాలలో కట్టెల పొయ్యి మీద వండే బగారా-మటన్.. ఆ విందును పసందుగా మార్చేస్తుంది. బిర్యానీలా కాకుండా.. బగారా బువ్వలో మసాలాలు తక్కువగా వాడుతారు. అందుకే, దీని ఘాటు మైల్డ్‌గా ఉంటుంది. అద్భుతమైన సువాసనతో నోరూరిస్తుంది. ఇక దీనికి జోడిగా వండే మటన్ కూర మాత్రం ఘాటుగా, స్పైసీగా ఉండాలి. కట్టెల పొయ్యిమీదే వండుతారు కాబట్టి, ఈ కూరకు ప్రత్యేకమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మటన్ రుచిని మరింత పెంచుతుంది. బగారా అన్నంలో ఈ మటన్ గ్రేవీ కలుపుకొని తింటే.. ఆ రుచే వేరు.

కాంబినేషన్ ఫుడ్ రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందిస్తాయి! అదే నాన్ కాంబినేషన్ పదార్థాలు మాత్రం అస్సలు ట్రై చేయొద్దు. పాలకూర-టమాట, పాలకూర-క్యాబేజీ తినడం వల్ల సమస్యలు రావొచ్చు. అలాగే పుల్లటి పదార్థాలకు పాలు జతచేసి తిన్నా ఇబ్బందే! పాలు- చేపలు, పెరుగు- చేపలు కాంబినేషన్ కూడా ఆమోదయోగ్యం కాదని పెద్దల మాట.

బుడమకాయల్ని చాలామంది అంతగా ఆదరించరు. ఏదో పప్పులోకి పనికొస్తుందనీ, రసంలోకి ఫ్లేవర్‌గా ఉంటుందనీ కొంటారు. కానీ, కాస్త పులుపు ఒంటబట్టించుకున్న బుడమకాయలో నీటిశాతం ఎక్కువ. వీటితో చేసే పాకాల్లో పచ్చడి తర్వాత అంతటి ప్రశస్తమైన వంటకం బరడా! చేయడం రాక, వచ్చినా కుదరక ఈ వంటకం వెనుకబడింది కానీ… ఒక్కసారి ట్రై చేస్తే అదిరిపోతుందంతే!! ఒకటిన్నర అంగుళం మేరకు బుడమకాయ ముక్కలు కట్ చేసుకోవాలి.
మరోవైపు శనగపప్పు బాగా వేయించి… రవ్వలా మిక్సీ పట్టుకోవాలి. బుడమకాయల్ని కూరలా చేస్తూ.. ముక్కలు మెత్తబడే వేళకు ఈ శనగపప్పు రవ్వ జతచేయాలి. బాగా కలిపితే భలేగా కుదురుతుంది. ఇలా వండిన బుడమకాయ బరడా బంగారు వన్నెలో మెరిసిపోతూ మైమరిపిస్తుంటుంది. అన్నంలోకి బరడా చక్కగా కలగలిపి.. ఆపై పచ్చిపులుసు పైనుంచి చిలకరించి.. పైపైన కలిపి ముద్ద ముద్దగా నోటికి అందిస్తే కొత్త రుచి సొంతమవుతుంది. పచ్చిపులుసు మొత్తంగా కలిపి.. అన్నం ముద్ద పరిమాణంలో బరడా నంజుకొని తిన్నా అలాంటి అనుభూతే కలుగుతుంది.