కైస్ట్చర్చ్: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా.. రెండో టెస్టులో విజయానికి చేరువైంది. మిడిలార్డర్ బ్యాటర్ కైల్ వెరినె (187 బంతుల్లో 136 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకంతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 354/9 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆఖర్లో కగిసో రబడ (47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. కివీస్ బౌలర్లలో సౌథీ, హెన్రీ, జెమీసన్, వాగ్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా 426 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. సోమవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.