Oils For Skin Health | సాధారణంగా చాలా మంది కేవలం చలికాలంలోనే తమ చర్మాన్ని సంరక్షించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. చలికాలంలో చర్మం పొడిగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. కనుక సహజంగానే అందరూ ఈ కాలంలో చర్మాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారు. మిగిలిన సీజన్లలో చర్మం గురించి అంతగా పట్టించుకోరు. కానీ ఏ కాలంలో అయినా సరే చర్మాన్ని కచ్చితంగా సంరక్షించుకోవాలి. లేదంటే అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది అనేక రకాల చర్మ సమస్యలను ఎదుర్కొంటన్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కాలుష్యం, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, మందులను అధికంగా వాడడం, పోషకాహార లోపం వంటివి చర్మ సమస్యలు వచ్చేందుకు కారణం అవుతున్నాయి. అయితే చర్మ సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ చర్మం కాంతివంతంగా మృదువుగా ఉండాలంటే అందుకు పలు రకాల నూనెలు దోహదం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
చర్మ సంరక్షణకు ఆలివ్ ఆయిల్ ఎంతో దోహదం చేస్తుంది. పొడి చర్మం ఉన్నవారు తరచూ ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించాలి. దీంతో శరీరానికి మర్దనా చేసుకుని స్నానం చేస్తుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. చర్మం తేమగా మారి మృదువుగా ఉంటుంది. పొడిదనం తగ్గుతుంది. అలాగే ఎండ వేడి కారణంగా కమిలి లేదా రంగు మారిన చర్మంపై ఈ నూనెను రాస్తుంటే ఉపయోగం ఉంటుంది. చర్మం తిరిగి పూర్వ స్థితికి వస్తుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఆలివ్ నూనెతో వారానికి ఒకసారి శరీరానికి మర్దనా చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ నూనెను మర్దనా చేస్తుంటే కండరాల నొప్పులు సైతం తగ్గిపోతాయి. ఆలివ్ నూనెను శిరోజాలకు కూడా మర్దనా చేయవచ్చు. దీని వల్ల జుట్టు ఒత్తుగా పెరిగి దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. తలలో రక్త ప్రసరణ మెరుగు పడి తలనొప్పి తగ్గుతుంది.
చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు గాను కొబ్బరినూనె కూడా ఎంతో సహాయం చేస్తుంది. కొబ్బరినూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు విటమిన్ ఇ ఉంటుంది. అందువల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. కొబ్బరినూనెను కాస్త వేడి చేసి గోరు వెచ్చగా ఉండగానే శరీరానికి మర్దనా చేయాలి. తరువాత కాసేపు ఆగి స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. పొడిబారిన చర్మం తేమగా మారుతుంది. కొబ్బరినూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక ఈ నూనెను రాస్తుంటే అన్ని రకాల చర్మ సమస్యలు, చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ సైతం నయమవుతాయి.
ఇక చర్మ సంరక్షణకు ఉపయోగపడే నూనెల్లో నువ్వుల నూనెకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. ఆయుర్వేదంలో దీన్ని మసాజ్‌ల కోసం ఉపయోగిస్తారు. పూర్వకాలంలో ప్రజలు నువ్వుల నూనెతోనే శరీరానికి మర్దనా చేసుకునేవారు. నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని కాస్త వేడి చేసి చర్మానికి రాసి సున్నితంగా మర్దనా చేయాలి. దీని వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు, పుండ్లపై ఈ నూనెను రాస్తుంటే అవి త్వరగా మానుతాయి. నువ్వుల నూనెతో శరీరానికి మర్దనా చేసి స్నానం చేస్తుంటే చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. మేని ఛాయ మెరుగు పడుతుంది. నువ్వుల నూనె వల్ల నాడీ మండల వ్యవస్థ ఉత్తేజితమై మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. నువ్వుల నూనె వల్ల కేవలం చర్మానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇలా చర్మ సంరక్షణకు ఆయా నూనెలను ఉపయోగించవచ్చు.