Gold-Silver Rate | గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల బంగారం ధరలు సరికొత్త రికార్డులను చేరాయి. ప్రస్తుతం డిమాండ్ తగ్గడంతో ధరలు ఊరటనిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో బలహీనమైన సంకేతాల మధ్య మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1200 తగ్గి తులం రూ.1,24,100కి చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1200 తగ్గి తులానికి రూ.1,23,500కి చేరుకుంది. అదే సమయంలో వెండి రూ.2500 తగ్గి కిలోకు రూ.1,51,500కి పతనమైందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. యూఎస్ ఫెడలర్ రిజర్వ్‌కు చెందిన అధికారులు చేసిన వ్యాఖ్యలు డిసెంబర్ నెలలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లనట్లయ్యిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలను తోసిపుచ్చడంతో బంగారం ధరలు మంగళవారం తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. ఆరు కరెన్సీల డాలర్ ఇండెక్స్ 0.12శాతం పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయి 99.99కి చేరుకుంది. ఇది బంగారం, వెండి ధరలపై ఒత్తిడిని పెంచింది. విదేశీ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.2శాతం తగ్గి 3,993.65 డాలర్లకు చేరింది. వెండి దాదాపు ఒకశాతం తగ్గి ఔన్సుకు 47.73 డాలర్లకు పడిపోయింది. కోటక్ సెక్యూరిటీస్‌లో కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన కైనాట్ చైన్వాలా మాట్లాడుతూ.. మార్కెట్ దృష్టి రాబోయే రాబోయే ఏడీపీ ఉపాధి, ఐఎస్ఎం పీఎంఐ డేటాపై కేంద్రీకృతమై ఉందని తెలిపారు. డిమాండ్ బలహీనపడడం, బంగారంపై చైనా పన్ను ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.