భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నా.. కేంద్రాల్లోని లబ్ధిదారులకు మాత్రం సేవలు పుష్కలంగా అందుతున్నాయి. రోజూ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు ఇబ్బంది కలగొద్దు.. వారికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలికేరి, కలెక్టర్ ప్రియాంక ఆల ప్రత్యేక చొరవతో జిల్లాలో తాళాలు వేసి ఉన్న అంగన్వాడీ కేంద్రాలు రెండో రోజు నుంచి తెరుచుకున్నాయి. దీంతో ప్రతి కేంద్రంలోని పిల్లలకు పౌష్టికాహారంతోపాటు ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీ స్థాయిలో బిల్ కలెక్టర్లు అంగన్వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. అందులో 1,923 కేంద్రాలను అధికారులు తెరిచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నిత్యం సేవలు అందాల్సిన కేంద్రాలు మూసి ఉంటే పిల్లలకు పౌష్టికాహారం అందదని, వెంటనే కేంద్రాలను తెరవాలని కలెక్టర్ పట్టుపట్టడంతో సీడీపీవోలు, సూపర్వైజర్లు గ్రామాల్లోకి వెళ్లి కేంద్రాలను తెరిపించారు. కొత్తగా వచ్చిన జిల్లా సంక్షేమాధికారి విజేత సైతం మారుమూల గ్రామాలకు వెళ్లి సర్పంచ్లు, అంగన్వాడీ యూనియన్ నాయకులతో మాట్లాడారు. కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవాల్సిందేనని చెప్పడంతో కొన్నిచోట్ల అంగన్వాడీ టీచర్లు ముందుకొచ్చి తాళాలు ఇచ్చేశారు. మరికొన్ని చోట్ల నాయకులు పట్టు వీడకపోవడంతో తాళాలు పగులగొట్టి మరీ కేంద్రాలను తెరిచారు.
యథావిధిగా ఇమ్యునైజేషన్..
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి మంగళవారం చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దీనికి ఆటంకం కలగొద్దనే ఉద్దేశంతో కేంద్రాలను తెరిపించి మరీ పిల్లలకు టీకాలు వేయించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఏఎన్ఎంలు పిల్లలకు టీకాలు వేసి, గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. ఇంటింటికీ వెళ్లి తల్లులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఇచ్చే టీకాలు సకాలంలో వేయడం వల్ల ఇమ్యునైషన్ కార్యక్రమం పూర్తిస్థాయిలో జరిగింది.
టీశాట్ యథాతధం
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం ప్రీస్కూల్ తరహాలో ఆ శాఖ టీశాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అయితే ఇందులో ఎలాంటి అంతరాయం లేకుండా తల్లుల మొబైల్ ద్వారా వచ్చే కార్యక్రమాన్ని సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి ఫోన్లో వారికి ఆన్ చేసి మరీ కొనసాగించారు. కొందరు అంగన్వాడీ కేంద్రాల్లోనే కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, ఐసీడీఎస్ సిబ్బంది కూడా కేంద్రాలకు వెళ్లి విధులకు ఆటంకం లేకుండా ఎక్కడికక్కడ సహకరిస్తున్నారు.
సమ్మెను వీడి.. సహకరించండి..
సమస్యలు అందరికీ ఉంటాయి. మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయి. వెంటనే అంగన్వాడీ టీచర్లు విధుల్లో చేరండి. మీ సమస్యలు మాకు తెలుసు. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుంది. విధులు నిర్వహిస్తూనే సమస్యల గురించి మాకు చెప్పండి. మేం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మీరంతా మా కుటుంబంలోని వారే. ఆలోచించండి. వెంటనే విధుల్లో చేరి మాకు సహకరించండి.
-వేల్పుల విజేత, జిల్లా సంక్షేమాధికారి