హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్ల రూపురేఖలను సమగ్రంగా మార్చే ‘మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి’ పథకంలో భాగంగా నిర్మించే కొత్త తరగతి గదుల డిజైన్లను అధికారులు సిద్ధం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది, ఉన్నత పాఠశాలల్లో 40 మంది విద్యార్థులకు సరిపోయేలా గదులను నిర్మించేలా ప్రణాళికలు రెడీ చేశారు. పునాదులతో కలిపితే మొత్తంగా 608.15 చదరపు ఫీట్ల విస్తీర్ణంతో ప్రాథమిక పాఠశాల, 770.37 చదరపు ఫీట్లతో ఉన్నత పాఠశాల తరగతి గదులను నిర్మించనున్నారు. ఎక్కువగా గాలి, వెలుతురు ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో వరుసలో ఐదు డ్యూయల్ డెస్క్‌ల చొప్పున మొత్తం 15 బెంచీలను ఏర్పాటు చేసేలా గదుల డిజైన్లను తయారుచేశారు.
తొలి విడతలో 4,400
రాష్ట్రంలో 26,065 పాఠశాలలకు 9,884 తరగతి గదులను కొత్తగా నిర్మించాల్సి ఉన్నది. మొత్తంగా 1,12,557 తరగతి గదులు అవసరముండగా, ప్రస్తుతానికి 1,02,673 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. మరో 9,884 కొత్త తరగతి గదులు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి పథకంలో భాగంగా 8 వేల తరగతి గదులను నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మూడు విడతల్లో 8 వేల గదులను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, మొదటి విడతలో 4,400 తరగతి గదులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గది డిజైన్ ఇలా..
ఆర్సీసీ స్లాబ్‌తో కూడిన తరగతి గది
20X16 ఫీట్ల పరిమాణంలో గది ఉంటుంది.
10 ఫీట్ల వెడల్పు గల కారిడార్
రెండు కిటికీలు, ఒక దర్వాజను బిగిస్తారు
ఒక్కో తరగతి గది కార్పెట్ ఏరియా 320.12 చదరపు ఫీట్లు
గది వాల్ (గోడలు) ఏరియా 56.61 చదరపు ఫీట్లు
కారిడార్ కార్పెట్ ఏరియా 200 చదరపు ఫీట్లు
కారిడార్ వాల్ (గోడలు) ఏరియా 31.42 చదరపు ఫీట్లు
ఉన్నత పాఠశాల తరగతి గది డిజైన్ ఇలా..
ఆర్సీసీ స్లాబ్‌తో భవనం
తరగతి గది పరిమాణం 20X 22 ఫీట్లు
6 ఫీట్ల వెడల్పు గల కారిడార్
40 మంది విద్యార్థులకు సరిపోయేలా గది నిర్మాణం
రెండు కిటికీలు, ఒక దర్వాజను బిగిస్తారు
ఒక్కో తరగతి గది కార్పెట్ ఏరియా 526.79 చదరపు ఫీట్లు
గది వాల్ (గోడలు) ఏరియా 71.58 చదరపు ఫీట్లు
కారిడార్ కార్పెట్ ఏరియా 143.80 చదరపు ఫీట్లు
కారిడార్ వాల్ (గోడలు) ఏరియా 28.20 చదరపు ఫీట్లు