
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో దేశంలోని అనేక మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం తిరోగమన దిశగా సాగుతున్నది. అయితే హైదరాబాద్ మహా నగరంలో మాత్రం అంతకంతకూ దూసుకుపోతున్నది. రియల్టీలో తన హవాను కొనసాగిస్తున్న భాగ్యనగరం.. ఆఫీస్ స్పేస్‌లో ఇతర నగరాలను వెనక్కినెట్టి ముందంజలో ఉన్నది. నిజానికి వ్యక్తిగత గృహాలు మొదలు కార్యాలయ స్థలాల వరకు దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే గణనీయమైన వృద్ధి హైదరాబాద్ సొంతం. ఈ క్రమంలోనే కరోనాకు ముందున్న సంవత్సరాల్లోని డిమాండ్ కంటే ఆ తర్వాత హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ రికవరీ 169 శాతంగా ఉందని కొలియర్స్ ఇంటర్నేషనల్ తాజా సర్వే వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై, పుణెల్లో 2016-18తో పోల్చి ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీని కొలిచింది.
సానుకూలతలు..
హైదరాబాద్ పరిధిలో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుతుందనేందుకు వివిధ అంశాలు దోహదపడుతున్నాయని నిర్మాణ రంగ నిపుణులు చెప్తున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు రాజకీయ, ఇతర భౌగోళిక పరిస్థితులు సైతం పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఐటీ, దాని అనుబంధ రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, తెస్తున్న విధానాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జేపీ మోర్గాన్ కంపెనీ ఆసియాలోనే తమ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ఇందుకు అద్దం పడుతున్నది. ఏకంగా 8.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సాలార్పురియా నాలెడ్జ్ సిటీలో ఏర్పాటైన ఈ క్యాంపస్‌లో 800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అలాగే రాయదుర్గం పరిధిలో మైహోం స్కైవ్యూ భవన సముదాయంలో ఇటీవల ఓ ఐటీ కంపెనీ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కార్యాలయ ఏర్పాటు కోసం లీజుకు తీసుకున్నది. అంతకుముందూ దేశ, విదేశీ బడా సంస్థలెన్నో హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
