
భువనేశ్వర్ : ఒడిశాలోని అధికార పార్టీ బిజు జనతాదళ్ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వైన్ ఎట్టకేలకు పదో తరగతి పాసయ్యారు. ఒడిశా బోర్డు నిర్వహించిన ఆఫ్‌లైన్ పరీక్షల్లో 5,233 మంది హాజరయ్యారు. వారిలో పూర్ణచంద్ర ఒకరు. గంజాం జిల్లాలోని సూరద నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఆ పరీక్షల్లో ఆయన ఫెయిల్ అయ్యారు. దీంతో ఫలితాలపై అభ్యంతరం తెలిపిన విద్యార్థుల కోసం ప్రభుత్వం మళ్లీ ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించింది. 5,233 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 80.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 141 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 3,100 మంది బాలురు, 2,133 మంది బాలికలు ఉన్నారు.
గంజాం జిల్లాలోని సూరదకు చెందిన స్వైన్ 49 సంవత్సరాల వయస్సులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఆయన బీ-2 గ్రేడ్‌తో పాసయ్యారు. 500 మార్కులకు గాను 340 మార్కులు సాధించారు. ఎమ్మెల్యేకు పెయింటింగ్‌లో అత్యధికంగా 85 మార్కులు, ఒరియా, జనరల్ సైన్స్‌లో 60 శాతం మార్కులు సాధించారు. ఆయన గత జూలైలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్టేట్ ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్ఓఎస్సీ) కోసం పరీక్ష రాశారు. ఆ సమయంలో ఆయనకు స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్ష కేంద్రంలోని ప్రత్యేక గదిలో రాయించారు. 1972లో జన్మించిన పూర్ణచంద్ర.. అప్పటి కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతితోనే చదువును ఆపేసిన ఆయన.. పదో తరగతి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకు ముందు పలుసార్లు పరీక్షలకు హాజరైనా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఎట్టకేలకు పాస్‌కావడంతో హర్షం వ్యక్తం చేశారు.