జ్యోతినగర్, మార్చి 25: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో రూ.423 కోట్లతో చేపట్టిన దేశంలోని అతిపెద్ద 100 మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ ప్లాంటు మరో మైలురాయిని అధిగమించింది. మొదటి విడుత 17.5 మెగావాట్లు, రెండోవిడుత 20 మెగావాట్లను వరుసగా రెండు విడుతల్లో 37.5 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి కమర్షియల్ ఆపరేషన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మూడో విడత గురువారం మరో 42.5 మెగావాట్లను ఉత్పత్తిదశలోకి తీసుకువచ్చారు. మొత్తం 80 మెగావాట్లను ఉత్పత్తి దశలోకి తేగా, మరికొన్ని నెలల్లో మిగిలిన 20 మెగావాట్లను ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. కాగా, రామగుండం ఎన్టీపీసీ బృందాన్ని ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నరేశ్ ఆనంద్, ఎన్టీపీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ శుక్రవారం అభినందించారు.