ఏదైనా నిర్మాణ పని చేపట్టే ముందు సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా టెండర్లు పిలుస్తారు. ఈ మేరకు తకువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు. కానీ, ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సరిల్ పరిధిలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరిగినట్టు తెలుస్తున్నది. టెండర్లు పిలిచిన ఈఈ స్థాయి అధికారికి తెలియకుండా టెక్నికల్ సిబ్బంది కొత్త నిబంధనలు పెట్టడంతో రూ.56.58 లక్షల టెండర్లలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. వారి నిర్వాకంతో కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకుండా పోగా, సంస్థ నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరీంనగర్ ముకరంపుర, ఏప్రిల్ 6 : ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ కరీంనగర్ సరిల్ పరిధిలోని రూరల్ డివిజన్లో మొత్తం 56.58 లక్షలతో మూడు పనులు చేపట్టేందుకు అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారు. అందులో గుండి ఈఆర్వో కార్యాలయానికి 24.19 లక్షలు, అల్గునూర్ ఈఆర్వో కార్యాలయానికి 23.86 లక్షలు, ఇండోర్ స్టోర్స్ షెడ్‌పై కప్పులో పాడైన ఏసీ షీట్లను తొలగించి, గాల్ వాల్యూమ్ షీట్లను వేసేందుకు మరో 8.53 లక్షలతో పనులు చేపట్టేందుకు గత నెలలో టెండర్లను పిలిచారు. అయితే, అందులో పాల్గొనే కాంట్రాక్టర్ల అర్హతలు, పని అనుభవం, సాంకేతిక అనుభవాల వివరాలను సంస్థలోని సివిల్ విభాగం ఈఈ పర్యవేక్షిస్తుంటారు. ఇవి సివిల్ పనులు అయినందున ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయంలోని సాంకేతిక విభాగం అధికారులు సివిల్ విభాగం నిర్దేశాలకు అనుగుణంగా టెండర్ల నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం పోటీలో పాల్గొన్న కాంట్రాక్టర్లలో తక్కువకు కోట్ చేసిన వారికి టెండర్లు దక్కే అవకాశం ఉంటుంది.
టెక్నికల్ సిబ్బంది జోక్యంతో మరో నిబంధన?
టెండర్లను పర్యవేక్షిస్తున్న అధికారికి తెలియకుండా ఎస్ఈ కార్యాలయంలోని టెక్నికల్ సిబ్బంది అదనంగా మరో నిబంధనను చేర్చినట్టు తెలిసింది. సివిల్ పనుల్లో 12 నెలల కాలంలో 10 లక్షల టర్నోవర్ ఉండాలనే నిబంధనకు తోడు ప్రత్యేకంగా ఆర్థిక సంవత్సరం చేర్చడంతో టెండర్లలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టెండర్లను పర్యవేక్షిస్తున్న ఈఈ విధించిన నిబంధనలకు ఇది విరుద్ధమని చెబుతున్నారు. టెండర్లలో పాల్గొనేందుకు 12 నెలల కాలంలో 10 లక్షల టర్నోవర్ అనే నిబంధన వరకు బాగానే ఉన్నా.. ప్రత్యేకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేసి ఉండాలని పేర్కొనడంతో చాలా మంది కాంట్రాక్టర్లు అనర్హులుగా మిగిలిపోతారు. దీంతో ఎవరో ఒకరిద్దరు మాత్రమే పనులు చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తున్నది. ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉంటే తక్కువ ధరకు కోడ్ చేసే వీలుంటుంది. దీనివల్ల సంస్థకు లాభం జరిగే వీలుంటుంది. కానీ, ఎస్ఈ కార్యాలయ సిబ్బంది నిర్వాకంతో సంస్థ నష్టపోయే పరిస్థితి వచ్చింది.
సీఎండీ దృష్టికి టెండర్ల వ్యవహారం
56.58 లక్షల టెండర్ల విషయంలో జరిగిన సాంకేతిక తప్పిదం కావాలనే కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో చేశారా.. లేక పొరపాటున జరిగిందా? టెండర్లను పర్యవేక్షిస్తున్న ఈఈ స్థాయి అధికారికి తెలిసి జరిగిందా.. తెలియక జరిగిందా? అనే విషయం తేలాల్సి ఉన్నది. ఆర్థిక సంవత్సరాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంతో చాలా మంది కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కోల్పోవాల్సి వచ్చింది. ఒకరిద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొంటే వారికి తోచిన ధరలే మెన్షన్ చేసే చాన్స్ ఉంది. టెండర్లు ఓపెన్ చేస్తే నిబంధనల ప్రకారం.. తక్కువ ధర రాకున్నా వీరికే పనులు అప్పగించాల్సి వస్తుంది. దీంతో ఈ విషయమై కొందరు కాంట్రాక్టర్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి టెండర్లు రద్దు చేయాలని, సాంకేతిక సిబ్బంది మెన్షన్ చేసిన ఆ ఒక్క నిబంధన తొలగించి తిరిగి టెండర్లు పిలువాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదు
ఈ టెండర్లు ఇంకా ఫైనల్ కాలేదు. సాంకేతిక ప్రమాణాల విషయం నా దృష్టికి రా లేదు. ఈ విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తాం. సాంకేతిక అర్హత ప్రమాణాలు ఏమిటనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– రవీందర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ (కరీంనగర్)