ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్‌ను వేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రేఖానాయక్, షకీల్, ఆత్రం సక్కు, మాగంటి గోపీనాథ్ , మాధవరం కృష్ణారావు తదితరులు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధనే ధ్యేయంగా 14 సంవత్సరాల పాటు శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా దేశమే గర్వపడేలా అనేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.
పేదల సంక్షేమంతో పాటు రాష్ట్రం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉద్యమనేత కేసీఆర్‌కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ పార్టీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రతిపాదనల నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు.