వెనిజులాకు చెందిన మరియా కొరినా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ (వర్ధమాన, పేద) దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. లాటిన్ అమెరికాలో చాలామంది ఆమెను శాంతికి ప్రతీకగా కాక; సంఘర్షణ, అస్థిరత, సంక్లిష్టమైన గ్లోబల్ రాజకీయాలకు ప్రతినిధిగా చూస్తున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడటాన్ని శాంతిని నెలకొల్పడంగా నోబెల్ కమిటీ పొరబడి ఆమెకు అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది. ఒకప్పుడు జరిగిన ఇలాంటి పొరపాట్లే గతంలో నోబెల్ శాంతి పురస్కారం ప్రతిష్టను దెబ్బతీశాయి.
వెనిజులాలో జరిగిన అత్యంత హింసాత్మక నిరసనల్లో ఒకటైన గ్వారింబాతో మచాడో రాజకీయ ప్రస్థానం ముడిపడి ఉన్నది. 2017లో జరిగిన ఈ అల్లర్లలో అనేక ప్రభుత్వ భవనాలు దగ్ధమయ్యాయి. పలువురు క్యూబా వైద్యులపై దాడులు జరిగాయి. స్థానికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవించారు. ఒర్లాండో ఫిగ్వెరా అనే ఆఫ్రో-వెనిజులన్ యువకుడిని నిరసనకారులు అత్యంత దారుణంగా చంపారు. ఇది ప్రజాస్వామ్య పోరాటం కానే కాదు, ప్రతిఘటన పేరిట జరిగిన హింసాత్మక ఉద్యమం. దేశభక్తి పేరిట మచాడో, ఆమె అనుచరులు ఈ ఘటనను సమర్థించారు. ఇది ఆమె రాజకీయ దృక్పథానికి తార్కాణం. హింసను స్వేచ్ఛగా మలచడం మచాడో రాజకీయ తత్వానికి మూలం. చర్చలు, శాంతికి బదులుగా ఆమె హింసను ప్రోత్సహించారు. సామాజిక, జాతీయ స్వాతంత్య్రం బలహీనపడటాన్ని మరుగునపడేసే స్వేచ్ఛ బల ప్రదర్శన ఇది.
మచాడోకు నోబెల్ శాంతి పురస్కారం ఎందుకిచ్చారనేది ప్రపంచ రాజకీయాలను పరిశీలిస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. వెనిజులాపై ట్రంప్ సర్కార్ విధించిన కఠిన ఆంక్షలను గతంలో ఆమె సమర్థించారు. ఆ ఆంక్షల మూలంగా వెనిజులాలో చాలామంది పేదలు తీవ్ర అవస్థలు పడ్డారు. దవాఖానలలో మందుల కొరత ఏర్పడింది. వలసవాదులను నిర్బంధించిన, లాటిన్ అమెరికా ప్రజల జీవితాలను దుర్భరం చేసిన వ్యక్తికి ఆమె మద్దతిచ్చారు. తద్వారా స్వేచ్ఛ పేరుతో అణచివేతను న్యాయబద్ధం చేసిన శక్తికి అండగా నిలబడ్డారు. మచాడోకు నోబెల్ కమిటీ బహుమతి ఇవ్వడమంటే.. దేశాల స్వతంత్రతను చిన్నచూపు చూడటం, బలప్రయోగంతో నియంత్రించడాన్ని శాంతి అని భావించే ఆలోచనలను అంగీకరించడమే.
ఇలా చేయడం నోబెల్ కమిటీకి కొత్త కాదు. హెన్రీ కిసింజర్ మొదలుకొని బరాక్ ఒబామా వరకు యుద్ధం, ఆంక్షలు, విధ్వంసంతో సంబంధమున్న నేతలకే నోబెల్ శాంతి బహుమతి దక్కింది. వాస్తవంగా శాంతి కోసం పాటుపడిన వారికి కాకుండా శాంతి గురించి ప్రసంగాలు చేసి పురస్కారం పొందినవారి జాబితాలో ఇప్పుడు మచాడో కూడా చేరిపోయారు. శాంతి కోసం ఇతరులు నిజంగా చేసిన ప్రయత్నాల కంటే వీరి ప్రసంగాలనే శాంతికి కృషిగా చూస్తున్నారు. నోబెల్ శాంతి పురస్కారం ఇకపై శాంతి కోసం కృషిచేసిన వారిని గౌరవించేది ఎంతమాత్రం కాదు. తమ విధానాలను సమర్థించే, తమకు అనుకూలంగా వ్యవహరించే వారిని పాశ్చాత్య దేశాలు గౌరవించుకునే వేదికగా అది మారిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న పిల్లలను రక్షించిన పాలస్తీనా వైద్యులు, అమెరికాలో బహిష్కరణకు గురైన తమ పిల్లల కోసం పోరాడుతున్న వెనిజులా తల్లులు, తమ భూముల కోసం పోరాటం చేస్తున్న గిరిజన మహిళలు తదితర నిజమైన శాంతియోధులకు అన్యాయం జరిగింది. వాస్తవానికి శాంతి కోసం పోరాడుతున్నది వీరు. కానీ, నోబెల్ కమిటీ మాత్రం వీరిని విస్మరిస్తున్నది.
శాంతి అనేది ఆడంబర వేదికలపై పురుడుపోసుకోదు. శాంతి అంటే సమావేశాల్లో ప్రసంగం కాదు. అన్యాయపు రాజ్య శక్తికి వ్యతిరేకంగా నిలబడే సాధారణ పౌరుల నుంచి శాంతి పుడుతుంది. పేదరికంలోకి నెట్టడాన్ని ధిక్కరించే కార్మికులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాడే రైతులు, దిగ్బంధం, ఆంక్షల సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ గాజాకు ఆహార పదార్థాలను తీసుకెళ్లిన సుమూద్ ఫ్లోటిల్లా వంటి బృందాలు అసలుసిసలు శాంతి దూతలు. స్వేచ్ఛ, న్యాయం, పరస్పర సహకారం మీద గ్లోబల్ సౌత్ కోరుకునే శాంతి ఆధారపడింది. అంతేతప్ప ఆంక్షలు, అణచివేతల మీద కాదు.
సామ్రాజ్యాన్ని, హింసను ప్రోత్సహించేవారికి, దానినే సంస్కరణగా పిలిచేవారికి పురస్కారం ఇవ్వడం ద్వారా ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం హాస్యాస్పదంగా మారిపోయింది. మచాడోకు శాంతి పురస్కారం ఇచ్చి శాంతి అనే మాటకు నోబెల్ కమిటీ తీరని అన్యాయం చేసింది. ఒకప్పుడు హెన్రీ కిసింజర్కి తప్పుడు ఆలోచనల ఆధారంగా నోబెల్ పురస్కారం ఇచ్చారు. ఇప్పుడు మచాడోకు కూడా అంతే. అందువల్లనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
ఆంక్షల ద్వారా దేశాలను ఆకలితో అలమటించేలా చేయడమే దౌత్యమని, దేశాలను విచ్ఛిన్నం చేసే దిగ్బంధనాన్ని ప్రజాస్వామ్య ఒత్తిడిగా భావిస్తే, ఇరాన్ నుంచి వెనిజులా వరకూ అనేక దేశాలపై కఠిన ఆంక్షలు విధించి, వలస కుటుంబాలను చెల్లాచెదురు చేసిన ట్రంప్ నిజంగా నోబెల్‌కు అర్హుడే కదా! మచాడో లాగానే ట్రంప్ కూడా తన అధికారాన్ని బలప్రదర్శనగా, హింసను చర్చగా, క్రూరత్వాన్ని పురస్కారం గెలిచే చర్యగా మలిచారు. ఆంక్షలు, ఆకలి, మారణహోమం ద్వారా శాంతిని సృష్టించిన వారి ఉమ్మడి కృషిని గౌరవిస్తూ.. వచ్చే ఏడాది వారిద్దరికీ నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వవచ్చు. ఎందుకంటే, ఈ వక్రీకరణల ప్రపంచంలో ఇకపై యుద్ధాన్ని నిజంగా ఆపేవారు కాదు, యుద్ధాలను శాసించగల శక్తి ఉన్నవారే శాంతి పురస్కారాన్ని పొందుతారు.
– సుక్కన్న