న్యూఢిల్లీ: రైల్వేను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తెలిపారు. కేంద్ర బడ్జెడ్‌పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం డబుల్ ఇంజన్ అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నదని తెలిపారు. రైల్వేలో ప్రభుత్వం మరింత కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రైల్వేను ప్రైవేటీకరించే ప్రశ్న లేదన్నారు.
కాగా, రైల్వే ప్రయాణీకుల అనుభవాన్ని మార్చాలన్న దృక్పథం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానంగా మూడు దశల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నదని చెప్పారు. కొత్త తరం రైళ్లను ప్రవేశపెట్టడం, రైల్వే స్టేషన్లను ఎద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం అన్నవి ముఖ్యమని వెల్లడించారు.
మరోవైపు ఇప్పటికే ఎయిర్ ఇండియాను టాటా సంస్థకు అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీని కూడా అమ్మకానికి పెట్టింది. అలాగే ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టడంతో రైల్వే ప్రైవేటీకరణపై ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తున్నది. కేంద్రం నిర్ణయాలు, చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేను ప్రైవేటీకరించబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.