న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారిక ప్రకటనలో తెలియజేసింది. భారత దేశంలో వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) ఉద్భవించి ఐదు దశాబ్దాలకు పైగా గడిచిందని, ప్రస్తుతం వారి ప్రభావం దేశంలో ఎక్కడా లేదని కేంద్రం తెలిపింది.
దేశంలో నక్సల్స్ ప్రభావం ఉన్న తొమ్మిది రాష్ర్టాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలిపిందని అధికారులు వెల్లడించారు. ‘దేశంలోని ఏ జిల్లా కూడా ఇకపై ఎల్డబ్ల్యూఈ ప్రభావిత క్యాటగిరీలో లేదు’ అని ఆ ప్రకనటలో పేర్కొన్నది. కాగా, దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దినట్టు హోం మంత్రి అమిత్ షా మార్చి 30న పార్లమెంట్లో ప్రకటించారు. దేశంలో నక్సలిజాన్ని మార్చి 31నాటికి అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైందని ఆయన చెప్పారు.