ఇల్లందకుంట: అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అమలు చేస్తామని దళిత బంధు పథకం పై ఎటువంటి అపోహలు, అనుమానాలు పడవలసిన అవసరం లేదని చొప్పదండి ఎమ్మెల్యే, ఇల్లందకుంట మండల ఇంచార్జ్ సుంకే రవిశంకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో దళితవాడలో దళితులతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు.
దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే గొప్పసంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకం ద్వారా నేరుగా దళితుల ఖాతాలో 10 లక్షలు పడేలా ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే ఏ సంక్షేమ పథకాలు అయిన ఏదో ఒక ప్రాంతం నుండి ప్రారంభం కావాల్సిందే కాబట్టి దళిత బంధు పథకం హుజురా బాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం పట్టించుకోవద్దని ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న ప్రతిపక్షాలు దళిత బందు పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దళితులు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని దళితబంధు పథకం పై ఎలాంటి అనుమానాలు అపోహలు వద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ రఫీ ఖాన్ ఎంపీటీసీ చిన్నరాయుడు, మాజీ సర్పంచ్ బుర్ర రమేష్ తో పాటు వార్డు సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు