
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఛారిటబుల్ ట్రస్టులు స్వీకరించే గ్రాంటులు, దాతృత్వయేతర విరాళాలపై 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సిఉంటుందని మహారాష్ట్ర ఏఏఆర్ రూలింగ్నిచ్చింది. ఛారిటబుల్ ట్రస్ట్‌గా ఐటీ యాక్ట్ కింద రిజిష్టరైన జయశంకర్ గ్రామీణ్ ఆదివాసి వికాస్ సంస్థా సంగామ్నర్…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందుతున్న గ్రాంటులు, వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి స్వీకరిస్తున్న విరాళాల మొత్తంపై జీఎస్టీ చెల్లించాలా లేదా అనే అంశమై అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్ మహారాష్ట్ర బెంచ్‌ను ఆశ్రయించింది. 50 మంది అనాధ బాలలకు వసతి, ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం తదితర సదుపాయాల్ని కల్పిస్తున్నది. ఇందుకు గాను ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక్కో అనాధకు నెలకు రూ. 2,000 చొప్పున చెల్లిస్తున్నది. పిల్లలకు అవసరమైన ఇతర ఖర్చుల్ని ట్రస్ట్ విరాళాల ద్వారా సమకూర్చుకుంటున్నది. ఈ ట్రస్టు పొందే గ్రాంటులపై 18 శాతం వస్తు సేవల పన్ను ఉంటుందని ఏఏఆర్ రూలింగ్ ఇచ్చింది. విరాళాల విషయానికొస్తే…కేవలం దాతృత్వ కార్యకలాపాల కోసమే విరాళాలు స్వీకరిస్తే జీఎస్టీ ఉండదని, అటువంటి విరాళాలతో వాణిజ్య లబ్ది చేకూరకూడదని, అది అడ్వర్టైజ్మెంట్ కాకూడదని ఏఏఆర్ స్పష్టంచేసింది. అలా లేకపోతే విరాళాలకు కూడా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది.
తాజా ఏఏఆర్ రూలింగ్ ఛారిటబుల్ సంస్థలన్నింటిపై పెను ప్రభావం చూపనుందని టాక్స్ కన్సల్టింగ్ సంస్థ ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ చెప్పారు. ఇప్పటివరకూ పరోక్ష పన్ను చట్టాల ప్రకారం ట్రస్టులపై పన్ను భారం లేదని, ఇక మీదట ఇవి జీఎస్టీ కింద రిజిష్టర్ కావాల్సివుంటుందన్నారు. 2017 నుంచి 18 శాతం జీఎస్టీ, పెనాల్టీ, వడ్డీతో కూడిన పన్ను డిమాండ్లు వీటిపై జారీఅవుతాయని మోహన్ వివరించారు.