హైదరాబాద్/నిజామాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా 113 మంది ఔట్ సోర్సిం గ్ సిబ్బందిని నియమించుకోవడంతోపాటు వీసీ రవీందర్ గుప్తా పాలకమండలిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నియామకాలను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్, టీయూ పాలకమండలి సభ్యుడు నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీయూ పాలకమండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి 11 రోజు ల క్రితమే సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చినా కేవలం ఒక్క రోజు ముందు మాత్రమే సమాచారం ఇవ్వడంపై సభ్యులు అసహనం వ్యక్తంచేశారు. ఎజెండా అంశాలను పక్కన పెట్టి వీసీ రవీందర్ గుప్తా, ప్రొఫెసర్ కనకయ్య తీరుపై గంటసేపు చర్చించారు. వీరు ఇరువురూ కలిసి చేస్తున్న అక్రమాలను లేవనెత్తారు. వీసీ రవీందర్ గుప్తా వ్యవహారంపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వం నియమించిన పాలకమండలి సభ్యులను కించపరిచేలా వ్యాఖ్యానించడం, అవమానపర్చడంపై వీసీని మందలించారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కల్పించుకొని సభ్యులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పించారు. వీసీ రెండు నెలల క్రితం హడావుడిగా నియమించిన ప్రొఫెసర్ కనకయ్య రిజిస్ట్రార్‌గా వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. ఇంత కాలం రిజిస్ట్రార్‌గా కనకయ్య తీసుకున్న నిర్ణయాలను, ఆయన జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా సూచించారు. గంటసేపటికే ఈసీ మీటింగ్‌ను రద్దు చేస్తున్నట్టు పాలకమండలి ప్రకటించింది. సమావేశాన్ని ఈ నెల 30వ తేదీనికి వాయిదా వేసింది. టీయూ మెయిన్ క్యాంపస్‌లోనే తదుపరి ఈసీ మీటింగ్ ఉంటుందని పాలకమండలి తెలిపింది.