ఆర్మూర్, డిసెంబర్ 6: నిజామాబాద్ జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బాల్కొండ మండలంలోని వన్నెల్(బీ) గ్రామానికి చెందిన ఆల్గోట్ దేవరాజు-లత దంపతుల కుమారుడు దేవేందర్ ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్- ఎస్సీ (కంప్యూటర్ సైన్స్) విభాగంలో గ్రూప్-1 గెజిటెడ్ స్థాయి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించారు. నిరుపేద మత్స్యకార కుటుంబానికి చెందిన దేవేందర్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో, బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తిచేశారు. గేట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ప్రస్తుతం బెంగళూరులోని ట్రిపుల్ ఐటీలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. 2020 జనవరిలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇస్రో నిర్వహించిన రాతపరీక్షకు హాజరయ్యారు. జనరల్ కోటాలోని 44 పోస్టులకు దేశవ్యాప్తంగా 50 వేల మంది పరీక్ష రాశారు. ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించగా, దేవేందర్ ఎంపికయ్యారు. ఓవైపు చదువుకుంటూనే ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికైన దేవేందర్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సన్మానించారు.