డిచ్పల్లి, మార్చి 24 : యాసంగి సీజన్లో వచ్చే ధాన్యాన్ని కొనే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేది లేదని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని జీ-కన్వెన్షన్ ఫంక్షన్ హా ల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తోపాటు ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతుంటే రాష్ట్రంలోని బీజేపీ నేతలు ప్రశించడం లేదని విమర్శించారు. పంజాబ్, హర్యానా రాష్ర్టా ల్లో మాదిరిగానే తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని గ్రామస్థాయి నుంచి గ్రామ పంచాయతీలు 26న తీర్మానాలు చేసి పంపాలన్నారు. అదేవిధంగా 27న మండల స్థాయి సమావేశంలో, 30న జిల్లా స్థాయి సమావేశంలో తీర్మానాలు చేసి పోస్టు ద్వారా పంపించాలన్నారు. సహకార సొసైటీలు, డీసీఎంఎస్ చైర్మన్లు కూడా తీర్మానాలు చేసి పంపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండివైఖరిని వీడకపోతే రానున్న రోజుల్లో రైతులతో కలిసి ఉద్యమించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రూరల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని నాయకులు ప్రతి రెండుమూడు నెలలకోసారి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
దేశంలో ఇతర రాష్ర్టాలు తెలంగాణవైపు చూస్తున్నాయని ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో అదేవిధంగా భారతదేశం మొత్తం సాగు, తాగునీరు, కరెంటు అనేక పథకాలతో ముందుకు తీసుకెళ్తారని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి మతం పేరుతో బీజేపీ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొండివైఖరిని వీడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. సమావేశంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఒలింపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు గడీల శ్రీరాములు, ఎంపీపీలు సంగీత, దీకొండ హరిత, రమేశ్‌నాయక్, సారికాహన్మంత్‌రెడ్డి, సంగీతారాజేందర్, అనూషాప్రేమ్నాయక్, జడ్పీటీసీలు దాసరి ఇందిరాలక్ష్మీనర్సయ్య, గంగారెడ్డి, గడ్డం సుమనారవిరెడ్డి, కమలానరేశ్, ఆయా మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు చింతల శ్రీనివాస్‌రెడ్డి, మధుకర్‌రావు, మొచ్చశ్రీనివాస్, నట్ట భోజన్న, మహిపాల్‌యాదవ్, శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, గజవాడ జైపాల్, నిమ్మల మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, నాయకులు లక్ష్మీనర్సయ్య, పద్మారావు, శక్కరికొండ కృష్ణ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంతిరెడ్డి మోహన్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.