నిజామాబాద్ క్రైం,మార్చి 24: నిజామాబాద్ జిల్లాలో ఆటో, క్యాబ్‌లలో ప్రయాణించే వారి రక్ష ణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో ఆటోలో ప్రయాణించిన వారిపై దాడు లు, హ త్యాయత్నాలు, దోపిడీలు జరిగిన ఘటన లు రికార్డుల్లో నమోదైన నేపథ్యంలో ఇక ముందు అలాంటి ఘటనలు జరగకుండా పోలీసు యం త్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఆటోలు, క్యాబ్‌లలో ప్ర యాణించే వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా సీపీ కేఆర్ నాగరాజు ఆదేశాలతో అవసరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో నడిపే ఆటోలు, క్యాబ్‌లకు క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి చేశారు.
21 వేల వాహనాలకు “ క్యూ ఆర్ కోడ్”
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో సుమారు 20వేల వరకు ఆటో రిక్షాలు, ఒక వెయ్యి వరకు క్యాబ్‌లు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఈ వాహనాల్లో ప్రయాణం చేసే వారి రక్షణ కోసం పోలీసులు కొత్త టెక్నాలజీతో తయా రు చేయించిన “ క్యూ ఆర్ కోడ్” వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరలోనే జిల్లా వ్యా ప్తంగా ఈ క్యూ ఆర్ కోడ్‌ను అన్ని ఆటో రిక్షాలు, క్యాబ్‌లకు అందజేయనున్నారు.
డాక్యుమెంట్లతోనే..
ఆటో రిక్షాలు, క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ వాహనాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పిస్తే వారు క్యూ ఆర్ కోడ్‌ను ఇస్తారు. డ్రైవర్ లైసెన్స్, వాహనం ఆర్సీ బుక్, ఇన్సురెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, యజమాని ఆధార్ కార్డుతో పాటు సెల్‌ఫోన్ నంబర్ సైతం అందజేయాల్సి ఉంటుంది. దీంతో వారు నిజామాబాద్ డివిజన్‌కు చెందిన వారైతే వాహనానికి ఆంగ్ల అక్షరం ఎన్, నంబర్‌తో క్యూ ఆర్ కోడ్‌ను జారీ చేస్తారు. ఆర్మూర్ డివిజన్ వాహనానికి ఏఆర్ సిరీస్, బోధన్ డివిజన్ వారికి బీడీ సిరీస్ తో పోలీసులు కోడ్ జారీ చేస్తారు.
ప్రతి పోలీస్ స్టేషన్లో పూర్తిడాటా ..
పోలీసులు జారీ చేసిన క్యూ ఆర్ కోడ్ నంబర్‌ను మీరు ఏదైనా పోలీసు స్టేషన్లో తెలియజేసినా ఆ నంబర్ ఆధారంగా ఆటో రిక్షా లేదా క్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు నిమిషాల్లో తెలుసుకునేలా టెక్నాలజీని ఏర్పాటు చేశారు. పోలీసులకు తెలిపిన సిరీస్ నంబర్ ద్వారా ఆ వాహనం ఏ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందనే విషయాన్ని కూడా గుర్తిస్తారు.
క్షణాలో పూర్తి డాటా..
ఆటో రిక్షాలు, క్యాబ్‌లలో ప్రయాణించే వారు ఎలాంటి భయాందోళన చెందకుండా వారికి పూర్తిస్థాయి రక్షణ కవచంలా ఉండేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రయాణించే వాహనానికి పోలీసులు జారీ చేసిన క్యూ ఆర్ కోడ్‌ను తమ సెల్ఫోన్ల స్కాన్ చేస్తే చాలు క్షణాల్లో ఆటో డ్రైవర్, యజమాని తదితర వివరాలు తెలిసిపోతాయి.
వెంటనే సమాచారం చేరవేసే అవకాశం..
మీరు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్‌పై మీకు ఎలాంటి అనుమానం కలిగినా.. లేదా అతని ప్రవర్తనపై అభ్యంతరకరంగా అనిపించినా వెంటనే తమను తాము సేఫ్ చేసుకొనే అవకాశం సైతం ప్రయాణికులకు కల్పించారు. సెల్‌ఫోన్ ద్వారా క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అందులో వచ్చిన సమాచారాన్ని వెంటనే తమ కుటుంబసభ్యులకు లేదా పోలీసులకు చేరవేయాలి. దీంతో మీరు ఏ వాహనంలో ప్రయాణిస్తున్నారు? ఆ వాహనం ఎటువైపు వెళ్తుందనే సమాచారాన్ని పోలీసులు నిమిషాల్లో కనుక్కొంటారు.
నిబంధనలు పాటించాలి..
ప్రతి ఆటో, క్యాబ్ వాలాలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జారీ చేస్తున్న క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్‌ను తప్పనిసరిగా పొందాలి. నిబంధనలను అతిక్రమించి వ్యవహరించొద్దు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలి. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కేఆర్ నాగరాజు, సీపీ