నిజామాబాద్ క్రైం, మార్చి 21: శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో సోషల్‌మీడియాపై పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరుగకుండా అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు వర్గాలకు ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని బోధన్ పట్టణంలో శివాజీ విగ్రహావిష్కరణ విషయంలో ఏర్పడిన వివాదంపై పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో పరిస్థితులు చేయిదాటిపోకుండా అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, ట్విట్టర్, ఫ్రెండ్స్ గ్రూపుల్లో కొంతమంది సభ్యులు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేస్తున్నారనే విషయాన్ని పోలీసు ప్రత్యేక విభాగాలు గుర్తించాయి. ఎక్కడో జరిగిన సంఘటనను ఈ ప్రాంతంలో జరిగినట్లు తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టడం, ఒక వీడియోకు మరో వ్యక్తి సంభాషణలను జోడించి గ్రూపుల్లో వైరల్ చేయడం వంటి అంశాలను నిఘా వర్గాలు గుర్తించే పనిలో పడ్డాయి. తమకు ప్రతికూలంగా ఉన్న వర్గానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టే పోకిరీలు, అల్లరిమూకలను గుర్తించి, వారి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. బోధన్‌లో చోటుచేసుకున్న సంఘటనపై రెచ్చగొట్టేలా వీడియోలు, వార్తల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేసేవారిపై ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేశారు.
గ్రూప్ అడ్మిన్‌పై చర్యలు
నిజామాబాద్ సీపీ కె.ఆర్.నాగరాజు ఆదేశాల మేరకు సోషల్ మీడియాపై సిబ్బంది దృష్టి సారించారు. ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్న యువతను గుర్తించేందుకు ఇంటలిజెన్స్ వర్గాలు సైతం ప్రత్యేక నిఘా పెట్టాయి. మత విద్వేషాలు, అల్లర్లకు కారకులుగా వ్యవహరించే సోషల్ మీడియా గ్రూపులపై రెండు రోజులుగా అటు పోలీస్ ప్రత్యేక బృందాలతోపాటు నిఘా వర్గాలు సైతం దృష్టి సారించాయి. వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తులతో పాటు దానిని ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసి న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దృష్టి సారించారు. సోషల్ మీడియా పోస్టుల వివరాలను ప్రత్యేక బృందాలు సేకరించి వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఏదైనా అభ్యంతరకరమైన పోస్టు వచ్చిన వెంటనే దాని వివరాలు, ఆ పోస్టును ఎవరు పెట్టారు, వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆ పోస్టు వల్ల ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అనే కోణం లో సైతం పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.