ఇందూరు, సెప్టెంబర్ 8 : పంట రుణాల పంపిణీలో అలసత్వం ఎందుకు అని బ్యాంకు అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రశ్నించారు. బ్యాంకర్ల అలసత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. ఇది సమంజసం కాదని, పనితీరు మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూకలెక్టరేట్)లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు.
ఒక్కో బ్యాంకు వారీగా పంట రుణాల పంపిణీలో సాధించిన ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలు బ్యాంకులు రుణాలు అందించడంలో పూర్తిగా వెనుకబడి ఉండడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 2022 వానకాలానికి సంబం ధించి గత నెలాఖరు నాటికి జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా 2,33, 377 మంది రైతులకు రూ. 2,308 కోట్ల మేర పంట రుణాలు అందించడం లక్ష్యం కాగా కేవలం 1,08, 279 మంది రైతులకు రూ.1,162.10 కోట్ల రుణాలు పంపిణీ చేశారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యంలో పంట రుణాల పంపిణీ 50 శాతానికే పరిమితమైందన్నారు. వ్యవసాయ టర్మ్ లోన్లకు సంబంధించి కూడా కేవలం 24.71 శాతం పంపిణీ చేయడంపై కలెక్టర్ పెదవి విరిచారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టి మూడు వారాల వ్యవధిలో రుణ పంపిణీ చేపట్టాలని సూచించారు. అక్టోబర్ మొదటి వారంలో తాను మళ్లీ సమీక్ష నిర్వహించే నాటికి అన్ని బ్యాంకుల్లో 90 శాతం మేర పంట రుణాల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలో లక్ష్యం సాధించని బ్యాంకులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రుణ బకాయిల వసూళ్ల విషయంలో జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలందిస్తామని, రైతులకు పంట రుణాలు అందించేందుకు బ్యాంకర్లు వెనుకాడవద్దన్నారు. ఐకేపీ మహిళా సం ఘాలకు లింకేజీ రుణాలు, యువతకు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు విరివిగా రుణాలు పంపిణీ చేయాలన్నారు.
ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎంతో ప్రాధాన్యతతో కూడిన బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి తప్పనిసరిగా ఆయా బ్యాంకుల తరపున సమన్వయకర్తలు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, లీడ్ బ్యాంకు ఏజీఎం రాజేంద్రప్రసాద్, జిల్లా మేనేజర్ శ్రీనివాసులు, నాబార్డు ఈజీఎం నాగేశ్, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, మెప్మా పీడీ రాములు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, మైనార్టీ సంక్షేమాధికారి నాగోరావు పాల్గొన్నారు.