నిజామాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. జనాభాలోనూ సగం… అన్ని రంగాల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నది నారీలోకం. మగవారితో సమానంగా ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారు. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న సమాజంలో మహిళలను కట్టుబాట్ల పేరుతో ఇంటికే పరిమితమనే నానుడికి కాలం చెల్లిందనే విధంగా రాష్ట్రంలో మహిళా ప్రయోజనకర పథకాలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో అత్యద్భుతమైన ప్రోత్సాహం వారికి లభిస్తున్నది. 2014 నుంచి నేటివరకు సీఎం కేసీఆర్ సారథ్యంలో అమలైన వందలాది పథకాల్లో అనేక స్కీములు మహిళాలోకానికి సంబంధించినవే. పారిశ్రామికంగా, వ్యాపార అవకాశాల్లో, అభాగ్యులకు ఆసరాగా, ఉద్యోగాల కల్పనలో, రాజకీయాల్లో రిజర్వేషన్లతో, పెండ్లిళ్లకు, పురుడుకి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా సీఎం కేసీఆర్ అన్నీతానై మహిళా లోకానికి నేనున్నానంటూ నిలుస్తున్నారు. ప్రభుత్వ ప్రయోజనాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ వారికి అనేక విధాలుగా మేలు చేకూరుస్తున్నారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
సహజ కాన్పులతో పునర్జన్మ..
తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సదుపాయాలు సమకూరుస్తున్నది. నాణ్యమైన సేవలు అందుతుండడంతో గర్భిణులు ప్రభుత్వ దవాఖానలకే మొగ్గు చూపుతున్నారు. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్టు, నగదు సాయం స్వాంతన కలిగిస్తున్నాయి. దీంతో జిల్లాలో గత కొద్ది కాలంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక ఏడాదిలో 20వేలకు పైగా ప్రసవాలు వెలుగు చూస్తే సర్కారు దవాఖానల్లో 50నుంచి 60శాతం ఉంటున్నాయి. ప్రైవేటులో 40శాతం వరకు జరుగుతున్నాయి. గతంలో చాలా మంది ప్రైవేటు దవాఖానలకు వెళ్లడం ద్వారా రూ.50వేల వరకు పోగొట్టుకునేవారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో 76,301 ఉచిత ప్రసవాలు జరిగాయి. అదనంగా ఆడబిడ్డకు రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు ఇవ్వడం విశేషం. రూ.2వేలు విలువ చేసే కేసీఆర్ కిట్ కూడా బాలింతకు అందిస్తున్నారు.
ఆడబిడ్డలకు మేనమామలా..
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల వివాహాలకు తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే సాయమందించేందుకు ప్రత్యేకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. తొలినాళ్లలో రూ.50వేలను అందించారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, వినతుల మేరకు ఆర్థిక సాయాన్ని రూ.75వేలకు పెంచారు. అనంతర కాలంలో ఏకంగా లక్షా నూట 16 రూపాయలకు పెంచడంతో పేదలకు మరింత ఊరట లభిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో నేటి వరకు దాదాపు 57,230 మం దికి మేలు జరిగింది. ఇందుకోసం రూ.480 కోట్లు పంపిణీ
చేశారు.
‘స్థానిక’ంలో 50శాతం రిజర్వేషన్లు..
అన్ని రంగాల్లో మేటిగా రాణిస్తున్న మహిళలకు దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. గతానికి భిన్నంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లో 50శాతం మహిళలకే రిజర్వ్ చేయడం చరిత్రలో నిలిచింది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు పురుషులకు దీటుగా మహిళా ప్రజాప్రతినిధులు కనిపిస్తున్నారు. పలుచోట్ల ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్లుగా అత్యధికంగా మహిళలను కూర్చోబెట్టి తగు ప్రాధాన్యతను అందించారు.
కొండంత ఆసరా..
పింఛన్ల రూపంలో ప్రభుత్వం ద్వారా చేయూతనందించి వితంతు, ఒంటరి మహిళల ఇబ్బందులను పోగొట్టారు. 2014 నుంచి 2018 వరకు పింఛన్‌ను రూ.వెయ్యి చొప్పున అందించగా, రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.2016 అందిస్తుండడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో వితంతువులు 68,331 మంది ఉండగా, ప్రతి నెలా రూ.13.78 కోట్లు, 9,847 మంది ఒంటరి మహిళలకు నెలకు రూ.1.98 కోట్లు వెచ్చిస్తుండడం విశేషం. బీడీ కార్మికులు 95,777 మం ది ఉన్నారు. వీరికి నెలకు రూ.19.31 కోట్లు వ్యయం అవుతున్నది. 47,920 మంది వృద్ధాప్య పింఛన్ పొందుంతుం డగా అందులో మహిళలు 35వేలు ఉన్నారు.
బాలికా విద్యకు పెద్దపీట..
ఆర్థికంగా వెనుకబడిన వారు, తల్లిదండ్రులు లేనివారు, నిరుపేద విద్యార్థినులు, వివిధ సమస్యలతో చదువును కొనసాగించలేని బాలికలకు కేజీబీవీల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. తొమ్మిదేండ్ల క్రితం ప్రారంభమైన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదో తరగతి వరకే విద్య అందేది. పై చదువులు చదవలేక, చదివించే వ్యక్తులు కరువై బాలికలు చదువుకు ముగింపు పలికారు. ఈ దుస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యను పొడిగించి అందిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 25 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2500 మంది చదువుతున్నారు. ఇందులో ఎనిమిదింటిని ఇంటర్ వరకు పొడిగించారు. డిచ్పల్లి, బోధన్, భీమ్‌గల్, మాక్లూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ – మోపాల్‌లో ఇంటర్ తరగతులు కొనసాగుతుండగా, 1280 మంది చదువుతున్నారు.
ఆశ, అంగన్వాడీలను కంటికి రెప్పలా..
ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా చూస్తున్నది. వారి సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రమే జీతాలు పెంచి అందిస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు రూ.13, 650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800కు పెరిగింది. ఉద్యోగ భద్రతతోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1469 మంది అంగన్వాడీ టీ చర్లు, 1500 మంది ఆయాలకు మే లు జరుగుతున్నది. ఆశవర్కర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1500 మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పడిన వెంటనే రూ.3వేలకు అక్కడి నుంచి రూ.7,500కు వేతనం పెంచారు. పీ ఆర్సీ అమలు చేయడంతో ఆశవర్కర్ల వేతనం ఇప్పుడు రూ.9,750కు చేరింది.
గురుకులాలతో..
రాష్ట్రంలో ప్రతి పేదింటి బిడ్డ చదువుకునేందుకు పుష్కలమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ స్థాయి హంగులు, ఆర్భాటాలతో ఏర్పాటైన ప్రభుత్వ గురుకుల విద్యాలయాలతో పేదవర్గాల చిన్నారులకు కొండంత అండ దొరికినట్లు అయ్యింది. నిజామాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలు తొమ్మిది ఉండగా ఇందులో బాలికలకు ఆరు ఏర్పాటు చేశారు. అదనంగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు రెండున్నాయి. జిల్లాలో నూతనంగా ఐదు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాలు ఏర్పాటు చేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో అదనంగా మరో ఆరు బీసీ గురుకులాలు నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేశారు.