నిజామాబాద్, అక్టోబర్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో ప్రక్షాళన మొ దలైం ది. ఐదు నెలలుగా ఇష్టారీతిన జరిగిన అడ్డగోలు నియామకాలు, పదోన్నతులను పాలక మండల సమావేశంలో రద్దు చేశారు. 276 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కన్నా ఒక్కరు ఎక్కువ ఉన్నా నియమించిన వ్యక్తుల నుంచి జీతాలు చెల్లింపులు చేయాలని నిర్ణ యిం చారు. ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా జరిగిన పనులన్నింటికీ ముగింపు పలికారు. వీసీ రవీందర్ గుప్తా, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కనకయ్య పనితీరుపై పాలక మండలి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్సిటీ ప్రతిష్ట పెంపొందించేందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం తోపాటు ఇన్చార్జి రిజిస్ట్రార్‌ను బాధ్యతల నుంచి తొలగించారు. కొత్తగా కామర్స్ విభాగం ప్రొఫెసర్ యాదగిరిని నియమించగా, వెనువెంటనే బాధ్యతలు సైతం స్వీకరించారు. వచ్చే నెల 27న మరోమారు పాలక మండలి సమావేశం ఉంటుందని సభ్యులు ప్రకటించారు. నెల రోజుల వ్యవధిలో వర్సిటీని గాడిలో పెట్టాలని వీసీ రవీందర్ గుప్తాకు అల్టిమేటం జారీ చేశారు. తీరు మార్చుకోకపోతే ఎలాంటి చర్యలకైనా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో వైపు వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు తోడుగా వ్యవహరించి అక్రమాలకు వంత పాడిన ప్రొఫెసర్లు, వర్సిటీ పరిపాలన సిబ్బంది తీరుపై వచ్చే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తప్పు చేసిన వారందరిపై చర్యలు తీసుకోనున్నారు.
యాదగిరి లోపలికి.. కనకయ్య బయటికి
దాదాపుగా ఐదున్నర గంటల పాటు సాగిన పాలక మండలి సమావేశంలో సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ కనకయ్య శనివారం ఉదయం వరకు రిజిస్ట్రార్గానే అధికారాన్ని చెలాయించారు. పాలక మండలి ఆదేశాలను పక్కన పెట్టి ఇన్చార్జి అనే పదాన్ని ఎక్కడా వాడలేదు. సమావేశంలో ఆయన ఉత్సాహం చూ పించేందుకు ఆసక్తి చూపారు. మొదట్లోనే గుర్తించిన ఈసీ సభ్యులు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇబ్బందికరమైన అంశాలను ప్రస్తావిస్తున్నట్లుగా గమనించి కనకయ్యను బయటికి పంపించారు. దీంతో ఆయన అక్కడే మీటింగ్ హాలు ఎదురుగా ఎదురు చూపులతో నిలబడాల్సి వచ్చింది. ఇదే సమయంలో ప్రొఫెసర్ యాదగిరిని లోపలికి పిలిపించారు.
రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి
సమావేశం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటలకు వరకు వాడి వేడిగా జరిగింది. గంటసేపు విరామం తరువాత తిరిగి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. ఉదయం సెషన్లో కొద్ది సేపు ప్రొఫెసర్ కనకయ్యను సమావేశంలోకి ఈసీ సభ్యులు అనుమ తించారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాల తంతును, ఆరోపణల పై వివరణ అడిగారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరును ఎండగట్టారు. అనంతరం ఆయనను బయటికి పంపించి ప్రొఫెసర్ యాదగిరితో ఈసీ మెంబర్లు భేటీ అయ్యారు. వీసీ రవీందర్ గుప్తా, కొత్త రిజిస్ట్రార్ యాదరిగితో కీలక అంశాలను చర్చించారు. ఇప్పటి వరకు వర్సిటీ ప్రతిష్టను కాపాడేందుకు కృషి చేయాలని సభ్యులంతా స్పష్టం చేశారు. ఇష్టారీతిన వ్యవహ రించకుండా చట్టాలు, ప్రభుత్వ జీవోలను గౌరవించాలని స్పష్టం చేశారు.
అక్రమాల్లో పాత్రధారులెందరో…
టీయూలోజరిగిన అక్రమాల్లో తెర ముందు ఆ ఇద్దరు వ్యక్తులు ప్రముఖంగా కనిపించారు. పోలీస్ నిఘా వర్గాలు సేకరించిన సమాచారం మేరకు కీలకమైన వ్యక్తులతో చేతులు కలిపి తమకు అనుకూలంగా ఇష్టారీతిన పనులు చేయించుకున్న వారి జాబితా భారీగానే ఉంది. వక్ర మార్గం లో పదోన్నతులు, జీతాల పెంపు, శాఖాపరమైన అంశాల్లో లబ్ధి పొం దేందుకు కొంత మంది ప్రొఫెసర్లు, పరిపాలన సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరించారు. 113 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో వీరిదే పైచేయిగా తెలుస్తోంది. పరిపాలన విభాగంలో పని చేస్తున్న కొంత మంది నేరుగా ఆ ఇద్దరి తో చనువుగా ఉంటూ తమకు భర్తలను, భార్యలను, బామ్మర్దులను, మరదళ్లను, స్నేహితులను ఇలా తెలిసిన వా రందరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేశారు. రూ. 50వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేయడంలో కీలకమైన వ్యక్తులు ఇద్దరికి కింది స్థా యిలోని ఉద్యోగులు బాహటంగానే సహకరిం చారు. వర్సిటీలో పని చేస్తూ తప్పుడు పనులు చేయ డానికి తెర వెనుక ప్రో త్సాహం అందించిన వీరిపైనా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కదిలించిన ‘నమస్తే ’ కథనాలు
టీయూలో వెలుగు చూసిన అక్రమాల బాగోతాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్న వ్యవహారాలను ఎప్ప టికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ‘నమస్తే ’ కథనాలపై స్పందించిన ప్రభుత్వం తొలుత సెప్టెంబర్ 24న రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి నియామకాలు చేపట్టొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ జీవోను పక్కన పెట్టి వర్సిటీ పెద్దలు అక్రమ తంతును గుట్టు చప్పుడు కాకుండా నడిపించడంతో ఆగని అక్రమాలు పేరిట మరోమారు ‘నమస్తే’ వార్త కథనాలు సంధించింది. ఫలితంగా ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. టీయూ లో అక్రమ బాగోతాలపై మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, విప్ గంప గోవర్ధన్ సైతం ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అక్టోబర్ 22న హైదరాబాద్‌లో పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. అన్నీ తామై వ్యవ హరించిన ఆ ఇద్దరు ఈసీ మీటింగ్‌ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కుట్రలు పన్నారు. ఈసీ మెంబర్లు వారి తీరును ఎండగట్టడంతో రసాభాసగా ఈసీ భేటీ ముగిసింది.
రిజిస్ట్రార్‌గా యాదగిరి నియామకం
డిచ్పల్లి, అక్టోబర్ 30: టీయూ నూతన రిజిస్ట్రార్‌గా కామర్స్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి నియమితులయ్యారు. వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉదయం జరిగిన పాలకమండలి సమావేశంలో రిజిస్ట్రార్‌గా ఎం.యాదగిరిని వీసీ రవీందర్‌గుప్త ప్రతిపాదించారు. దీంతో పాలకమండలి సభ్యులు రిజిస్ట్రార్ నియామకానికి ఒకే చెప్పారు. దీంతో యాదగిరి వెంటనే రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీయూ రిజిస్ట్రార్‌గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2018-2021 వరకు మూడు సంవత్సరాల పాటు నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసి కొద్దినెలల క్రితమే ఇక్కడికి వచ్చారు. రిజిస్ట్రార్‌గా నియమితులైన యాదగిరిని అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.