డిచ్పల్లి, అక్టోబర్ 30 : ప్రజల మేలు కోసమే చట్టాలను రూపకల్పన చేశారని, హక్కులను అనుభవిస్తూనే బాధ్యతల బరువును కూడా స్వీకరించాలని హైకోర్టు జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి సూచించారు. భారతావనిలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నట్లు, రహదారులు ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లుగా న్యాయార్థులకు సేవల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలోని జీ-కన్వెన్షన్ హాల్లో శనివారం ఏర్పాటుచేసిన పాన్ ఇండియా అవగాహన సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేస్తూ ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు సమాన ఆస్తిహక్కును కల్పిస్తూ 1995లో చట్టం తీసుకొచ్చారని, తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారసత్వ చట్టానికి సవరణలు రూపొందించిందని వెల్లడించారు. పేదరికం లేని సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పేదలు, ధనికులకు చట్టం సమానంగా పనిచేస్తుందని అన్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసమే చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. న్యాయశాఖ, కార్యానిర్వహ శాఖ, పోలీసు విభాగం సమన్వయంతో న్యాయసేవలను విస్తృతస్థాయిలో ప్రజల దగ్గరికి చేర్చడమే లక్ష్యంగా పాన్ ఇండియా కార్యక్రమాలు చేపట్టినట్లు జడ్జి తెలిపారు. ఉమ్మడి జిల్లా జడ్జి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కాలంలో లోక్ అదాలత్ ద్వారా లక్షా పదివేలకు పైగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని తెలిపారు. పాన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 300కు పైగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి నిర్వహకులకు హైకోర్టు జడ్జి పలు సూచనలు చేశారు. జిల్లా జడ్జి, కలెక్టర్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు, సైకిళ్లు, దుప్పట్లు, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ అరవింద్, అదనపు జిల్లా జడ్జిలు పంచాక్షరి, షౌకత్ జహాన్ సిద్దిఖీ, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, జూనియర్ సివిల్ జడ్జిలు కళార్చన, గిరిజ, సౌందర్య, భవ్య, అజయ్‌కుమార్ జాదవ్, సంస్థ ప్యానల్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, ఆశ నారాయణ, మాణిక్‌రాజ్, పుష్యమిత్ర, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మహి పాల్గొన్నారు.