నిజామాబాద్, అక్టోబర్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోంది. ఆసరా లేని వారికి వరంగా మారిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ విద్యను తెరమీదికి తీసుకువచ్చిన ప్రభుత్వం… అనుకున్నట్లే కేంద్ర ప్రభుత్వ అనుమతులను పొందింది. ప్రభుత్వ నిర్ణయం పేద విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఎనిమిదేండ్ల క్రితం ప్రారంభమైన కేజీబీవీలు ఇప్పటి వరకు పదో తరగతి వరకే విద్యను అందిస్తున్నాయి. ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లాలాంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కొంత మంది ఆర్థికస్థోమత లేనివారు చదువుకు ముగింపు పలుకుతున్నారు. ఈ దుస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని దేశ వ్యాప్తంగా కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్యను పొడిగించాలని ప్రతిపాదించింది. కేంద్రంపై ఒత్తిడి చేయడంతో రెండేండ్ల నుంచి దశల వారీగా కేజీబీవీలను ఇంటర్వరకు అప్గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 8, కామారెడ్డి జిల్లాలో 6 కేజీబీవీల్లో ఇంటర్ విద్యను అందిస్తుండగా, వచ్చే విద్యాసంవత్సరం మరిన్ని పాఠశాలలను ఉన్నతీకరించాలని ప్రతిపాదనలను విద్యా శాఖ సిద్ధం చేసింది.
ఉన్నత విద్యకు ఊతం…
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేజీబీవీల్లో నాలుగేండ్ల క్రితమే ఇంటర్మీడియెట్ వరకూ పొడిగించాలని నిర్ణయించారు. కానీ, కేంద్రం తీరుతో అమలు కాలేదు. బాలికా విద్యను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రి మండలి సలహా బోర్డు(కేట్) సబ్ కమిటీ ఇదే ప్రతిపాదన చేసింది. అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ సబ్ కమిటీకి చైర్మన్గా వ్యవహారించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేజీబీవీల్లో అవకాశం కల్పిస్తే అనేక మంది నిరుపేద విద్యార్థినులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదనకు మద్దతు తెలుపడంతో ఇంటర్ విద్య అమలవుతోంది. ఎస్సెస్సీ పాసైన బాలికల్లో కొందరే ప్రభుత్వ కళాశాలల్లో చేరుతున్నారు. మరికొందరిని ఉపాధ్యాయులే గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. సీట్లు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండడంతో అందరికీ అవకాశం దక్కడంలేదు. దీంతో అనేక మంది చదువుకు దూరమవ్వగా, ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
బాలికల ఉన్నతికి అండగా..
బాలికలకు ఉన్నతవిద్యను అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మండలానికో కేజీబీవీని ఏర్పాటుచేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, తల్లిదండ్రులు లేని వారు, పేద విద్యార్థినులు, వివిధ సమస్యల కారణంగా చదువును కొనసాగించలేని వారికి కేజీబీవీల్లో ప్రవేశం కల్పించారు. ఒక్కో పాఠశాలలో దాదాపు 200 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రత్యేకంగా బోధకుల నియామకంతోపాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు తదితర అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ సర్కారు కాస్మొటిక్ చార్జీలు సైతం చెల్తిస్తున్నది. విద్యార్థులకు వృత్తి విద్యలోనూ కేజీబీవీల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం అన్ని చోట్లా సొంత భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి విద్యార్థినులు ఎస్సెస్సీలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. గ్రామాల్లో ఆసరా కోల్పోయిన బాలికలకు కొండంత అండగా నిలుస్తున్న కేజీబీవీ.. చదువులతో మంచి ప్రగతి కనిపిస్తున్నది.
14 కేజీబీవీలు అప్గ్రేడ్…
నిజామాబాద్ జిల్లాలో 25 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలున్నాయి. ఇందులో 8 పాఠశాలలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. 2018-19 నుంచి డిచ్పల్లి, బోధన్, భీమ్గల్, మాక్లూర్, బాల్కొండ, జక్రాన్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్-మోపాల్లో ఇంటర్మీడియెట్ బోధన కొనసాగుతున్నది. జిల్లాలోని కేజీబీవీల్లో 5వేల మంది ఆరు నుంచి పదో తరగతి వరకు ఉండగా, ఇంటర్మీడియెట్ చదివేవారి సంఖ్య 1280 ఉంది. ఒక్కో పాఠశాలలో ఫస్టియర్లో 80, సెకండియర్లో 80 మందికి చొప్పున ఉచితంగా బోధన అందుతుండడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో 19 కేజీబీవీలుండగా, 3800 మంది బాలికలు పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. గతంలో కామారెడ్డి జిల్లాలో 5 పాఠశాలలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మరో కేజీబీవీని ఉన్నతీకరించారు. ప్రస్తుతం జిల్లాలో 6 కేజీబీవీల్లో 960 మందికి ఉన్నత విద్య అందుతున్నది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో నవీపేట, నందిపేట కేజీబీవీలను అప్గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి అధికారులు పంపించారు. వచ్చే విద్యా సంవత్సరంలో వీటికి ఆమోదం లభించే అవకాశాలున్నాయి.
పేద బాలికలకు ఉత్తమ విద్యాబోధన
కేజీబీవీల్లో పేద విద్యార్థినులకు ఉత్తమ విద్యాబోధన అందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో దశల వారీగా పలు కేజీబీవీలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది మరికొన్నింటికి అవకాశం ఇవ్వాలని కోరాము.