నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 29: జిల్లాలో ఇంటంటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్లో టీకాల పంపిణీని కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. అనంతరం గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత, విద్యార్థులు కొవిడ్ టీకాలు తీసుకొని వ్యాక్సినేషన్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇతరులు కూడా తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సెంకడ్ వేవ్‌లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. వ్యాక్సిన్‌తో కరోనాను అడ్డుకోవచ్చని అవగాహన కల్పించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.5 లక్షల మందికి ఫస్ట్‌డోస్ వేసినట్లు వెల్లడించారు. నవంబర్ 3లోగా మరో మూడు లక్షల మందికి టీకా వేస్తామన్నారు. ఆయన వెంట ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, ఇన్చార్జి డీఎంహెచ్‌వో సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో..
ధర్పల్లిలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీపీ నల్ల సారికా హన్మంత్‌రెడ్డి ప్రారంభించగా, ఎంపీడీవో నటరాజ్, మెడికల్ ఆఫీసర్ రఘువీర్‌గౌడ్ పర్యవేక్షించారు. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో వ్యాక్సినేషన్‌ను ఆర్డీవో రవి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో రాములు నాయక్ పరిశీలించారు. ఒక్కరోజే 150 మందికి టీకాలు వేశామని వారు తెలిపారు.
కోటగిరి మండలం పొతంగల్‌లో టీకాల పంపిణీ సందర్భంగా ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, సర్పంచ్ శంకర్, ఎంపీవో మారుతి, డాక్టర్ సమత తదితరులు ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సమీక్ష నిర్వహించారు. మండలంలో నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. చందూర్‌లో టీకాల పంపిణీని ప్రత్యేకాధికారి డోలి రమేశ్ ఎంపీడీవో నీలావతి, స్థానిక సర్పంచ్ సాయారెడ్డి పరిశీలించారు.
మాక్లూర్‌లో వ్యాక్సినేషన్‌ను డీపీవో జయసుధ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్మూర్ పట్టణంలో అధికారులు, ఎడపల్లి మండలం నెహ్రూనగర్, కుర్నాపల్లిలో సర్పంచ్ అమానుల్లా షరీఫ్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్‌ఖాన్ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. రెంజల్ మండలం కందకుర్తిలో 130 మందికి, సాటాపూర్‌లో 55 మందికి టీకాలు వేశారు. కందకుర్తిలో సర్పంచ్ ఖలీంబేగ్ దగ్గరుండి టీకాలు వేయించారు. నవీపేట మండలం జన్నేపల్లిలో సర్పంచ్ సబితారాజు ఆధ్వర్యంలో సిబ్బంది టీకాలు వేశారు.