తెలంగాణ యూనివర్సిటీలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అవుట్సోర్సింగ్ నియామకాలను రద్దు చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. వీసీ, రిజిస్ట్రార్ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వారి వ్యవహారశైలికి నిరసనగా ఎజెండా అంశాలు చర్చించకుండానే ఈ నెల 20న జరిగిన పాలకమండలి సమావేశం వాయిదా పడింది. వీసీ, రిజిస్ట్రార్ ఒకవైపు.. సభ్యులు మరోవైపు అన్నట్లుగా వ్యవహారం మారిన నేపథ్యంలో.. నేడు టీయూలో జరుగనున్న పాలకమండలి సమావేశంపై ఆసక్తి నెలకొంది. గత ఎజెండానే మళ్లీ సభ్యుల ముందుకు తెచ్చేందుకు వీసీ, రిజిస్ట్రార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నిజామాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం డిచ్పల్లి మెయిన్ క్యాంపస్‌లో శనివారం జరుగనున్నది. హైదరాబాద్‌లో అక్టోబర్ 22న తలపెట్టిన మీటింగ్ అర్ధాంతరంగా ఈసీ సభ్యులు వాయిదా వేశారు. వీసీ రవీందర్ గుప్తా, ప్రొఫెసర్ కనకయ్య తీరుతో సమావేశం రసాభాసగా ముగిసి ఎజెండాలోని అంశాలేవీ చర్చించలేదు. ప్రభుత్వం తరపున హాజరైన ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సైతం ఈసీ మీటింగ్‌ను రద్దు చేసి తదుపరి సమావేశాన్ని క్యాంపస్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జరుగబోతున్న పాలక మండలి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 120 పేజీలకు పైగా ఎజెండాతో గత మీటింగ్‌కు హాజరైన వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఇప్పుడు కూడా అదే ఎజెండాను ఈసీ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందులో అనేక ఎజెండా అంశాలు ప్రభుత్వ ఉద్దేశాలకు, లక్ష్యాలకు భిన్నంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించే విధంగానే సంబంధిత బాధ్యులు ఎజెండాను రూపొందించారని సమాచారం. ఈసీ సభ్యులతో ఆమోదం దక్కించుకుంటే ఇక ఇష్టానుసారంగా వ్యవహరించుకోవచ్చని మాస్టర్ ప్లాన్ వేసినట్లు అర్థం అవుతున్నది.
ప్రక్షాళన జరిగేనా…?
టీయూ గతంలో కంటే గడిచిన నాలుగైదు నెలల్లో తీవ్రం గా అభాసుపాలైంది. గడిచిన కొద్ది రోజుల్లోనే గందరగోళ ప్రకటనలు, నియామకాలు, పదోన్నతులు వంటి అంశాల్లో రూ.ల క్షలు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. యూనివర్సిటీకి సారథ్యం వహించే వ్యక్తులే అడ్డదిడ్డంగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ అన్నది లేకుండా పోయింది. కీలకమైన వ్యక్తులు ఇష్టారాజ్యంగా పని చేయడం ద్వారా కింది స్థాయిలో పట్టు తప్పింది. పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది. అక్రమ ప్రమోషన్ల విషయం తేనె తుట్టే మాదిరిగా కదిలిం ది. అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఇద్దరు నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రమోషన్లు కల్పించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అర్హతలు లేకపోయినా ప్రమోషన్లు కల్పించి, జీతాలు సైతం మంజూరు చేయడం ఏమిటని టీయూలో పని చేస్తోన్న సిబ్బందే ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇంత ఘోరమైన తీరు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, శాశ్వత ప్రాతిపదికన పని చేస్తోన్న కొంత మంది సిబ్బంది గ్రూపులుగా విడిపోయి పట్టు జారిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పరిస్థితి మారడం తో యూనివర్సిటీ పరిపాలన తిరిగి పట్టాలెక్కించే ప్రక్రియ ఇప్పట్లో కాని వ్యవహారం. కీలకమైన సమయంలో జరుగుతున్న పాలక మండలి సమావేశంతోనైనా యూనివర్సిటీ తిరిగి గాడిలో పడేనా? ప్రక్షాళన జరిగేనా? అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
డబ్బుల కోసం చక్కర్లు…
రూ.లక్షలు చెల్లిస్తే ఉద్యోగం వస్తుందనే మాటలు నమ్మి చాలా మంది అమాయకులు యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం అయ్యారు. ఏకంగా 113 మంది ని వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ నియమించినట్లుగా బహిరంగంగానే యూనివర్సిటీలోని అన్ని విభాగాల అధిపతులు ఆరోపణలు చేస్తున్నారు. గత ఈసీ మీటింగ్‌లో అక్రమ ఉద్యోగ నియామకాలపై వాడివేడి చర్చ జరుగగా… ప్రభుత్వం కల్పించుకుని సీరియస్‌గా స్పందించింది. నియామకాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాలని స్వయంగా వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలు సైతం జారీ చేశారు. నేటికి 10 రోజులు కావొస్తున్న వీసీ మాత్రం అలాంటి ప్రకటన చేయలేదు. పైగా ఉద్యోగాల్లో చే రిన కొంత మంది వ్యక్తులతో ఆందోళనలు చేయిస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. చెప్పుడు మాటలు విని డబ్బులు ముట్టజెప్పి ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు ఆగమా గం అవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో తాము చెల్లించిన డ బ్బులు తిరిగి వెనక్కి వస్తాయా? రావా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేసిన మధ్యవర్తులు స్పందించకపోవడంతో వారంతా యూనివర్సిటీ ఉన్నతాధికారులను నిలదీసేందుకు సిద్ధం అవుతున్నారు.
రిజిస్ట్రార్ ఎవరు…?
వైస్ చాన్సలర్‌గా రవీందర్ గుప్తాను ప్రభుత్వం నియమించిన కొద్ది రోజులకే యూనివర్సిటీలో రిజిస్ట్రార్ మార్పు జరిగింది. అప్పటి వరకు పని చేసిన ప్రొఫెసర్ నసీంను పక్కన పెట్టి ప్రొఫెసర్ కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించినట్లుగా కొత్త వీసీ ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఈసీ ఆమోదం తెలిపితేనే రిజిస్ట్రార్ నియామకం చెల్లుబాటు అవుతుంది. రిజిస్ట్రార్ నియామకంలో వీసీ రవీందర్ గుప్తా తీసుకున్న నిర్ణయంపై ఈసీ సభ్యులంతా అనుమానం వ్యక్తం చేశారు. అక్టోబర్ 22 నాటి మీటింగ్‌లోనూ ప్రొఫెసర్ కనకయ్యను ఇన్చార్జి రిజిస్ట్రార్గానే కొనసాగాలంటూ స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు సైతం ఇచ్చింది. ప్రభుత్వం అంటే గౌరవం లేని వ్యక్తులు మాత్రం యథాలాపంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా వ్యవహరించాల్సిన ప్రొఫెసర్ కనకయ్య ఈసీ ఆమోదం లేకుండానే రిజిస్ట్రార్‌గా పేర్కొంటూ అధికారిక ప్రకటనలు చేయడం విడ్డూరంగా మారింది. తెలంగాణ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి పేరుతో వెలువడిన ప్రకటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు టీయూలో శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కనకయ్యను ఈసీ ఆమోదిస్తుందా? లేదంటే కొత్త వారిని రికమండ్ చేస్తుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.