రైతు కోసం రణం సాగిస్తున్న గులాబీదళం రాజధానిలో యుద్ధభేరిని మోగించింది. వరిరైతు ఉసురుతీస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ.. హైదరాబాద్‌లో గురువారం టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. అన్నదాతల పక్షాన సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నాలో పాల్గొని కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రం వైఖరిని స్పష్టంచేయాలని రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమబాట పట్టడంతో కర్షకలోకం హర్షం వ్యక్తంచేస్తున్నది. ఈ మహాధర్నాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ధర్నాకు హాజరయ్యారు.
నిజామాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే టీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కర్షకుల కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు గురువారం నిర్వహించిన రైతు మహా ధర్నా కార్యక్రమానికి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ప్రజా ప్రతినిధులందరూ రాజధాని హైదరాబాద్‌కు కదిలి వెళ్లారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ధర్నాకు హాజరయ్యారు. కేంద్రం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని, రాష్ట్ర బీజేపీ నేతల తీరును ఎండగడుతూ మరో పోరాటానికి టీఆర్ఎస్ సిద్ధం కావడంతో రైతులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని ముక్త కంఠంతో పేర్కొంటున్నారు. ఉభయ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరూ నిర్ధిష్ట సమయానికే ధర్నా చౌక్‌కు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఆకుపచ్చ కండువాలు ధరించి రైతుకు మద్దతుగా మేమున్నామంటూ సమర శంఖం పూరించారు.
బీజేపీ తీరు తేటతెల్లం..
మహాధర్నా కార్యక్రమంతో భారతీయ జనతా పార్టీ తీరు తేటతెల్లమైంది. ద్వంద్వ ప్రకటనలు, ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న అంశాలపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో స్పష్టత వస్తోంది. చాలా మంది ఆలోచనపరులు మహాధర్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని విని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రైతులకు ఏ విధం గా చేటు చేస్తుందనే కోణంలో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్… తెలంగాణ రైతు కోసం రోడ్డెక్కి ధర్నా చేయడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంకుఠిత దీక్షతో తెలంగాణను సాధించినట్లే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రైతుకు మేలు చేకూర్చడం ఖాయమేనన్న నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. తెలంగాణ రైతు కోసం సీఎం కేసీఆర్ గడిచిన కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనతో రైతులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నవంబర్ 12 నాటి నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల్లోనూ రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తాజాగా హైదరాబాద్ మహాధర్నాలో ప్రజా ప్రతినిధులే స్వయంగా పాల్గొనడంతో కర్షకుల్లో ధీమా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళనలతో రైతుల కష్టాలు తీర్చేందుకు కేసీఆర్ ఉన్నారనే నమ్మకం రైతుల్లో స్పష్టం అవుతున్నది.
తరలి వెళ్లిన ప్రజా ప్రతినిధులు..
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు ఉద్యమ కాలంలో రోడ్డెక్కిన గులాబీ సైన్యం అదే స్ఫూర్తితో బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కదం తొక్కారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాకు ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, మేయర్ నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డితో తదితరులు ధర్నాకు హాజరయ్యారు.
రైతులకు టీఆర్ఎస్ అండ
కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో ఇబ్బందులకు గురవుతున్న రైతులకు టీఆర్ఎస్ అండ గా నిలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే సీఎం కేసీఆర్ అంకితభావం స్ఫూర్తిదాయకం. మన హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం.
-కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ, నిజామాబాద్
ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తాం. రాష్ట్ర రైతులను అయోమయానికి గురి చేస్తూ వారిపై కక్ష సాధింపు చర్యలకు కేంద్రం దిగింది. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేయాలి లేదంటే రైతుల కోసం ఉద్యమిస్తాం.
-బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ
మొండివైఖరి విడనాడాలి
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలి. లేనిపక్షంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే
కేంద్రం స్పష్టతనిచ్చే వరకు పోరాటం..
కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణపై స్పష్టతనిచ్చే వ రకు రైతులతో కలిసి పోరాటం చేస్తాం. రైతుల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతల కుట్రలను అడుగడుగునా అడ్డుకుంటాం.
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే
రైతుల గురించి ఆలోచించేది కేసీఆర్ ఒక్కరే..
రైతుల గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. దేశం లోనే ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేయడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారు. కా నీ కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోకాలడ్డుతున్నది.
-బిగాల గణేశ్‌గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే