బోధన్, నవంబర్ 18 : సహకార ఉద్యమ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని రాష్ట్ర సహకార యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ అన్నారు. మండలంలోని మావందికుర్దూ గ్రామం లో బోధన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం 68వ అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అరుణ హాజరై మాట్లాడారు. ఒక్కరే చేయలేని పనిని పదిమంది కలిస్తే సులువుగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. ఇదే సహకార ఉద్యమంలోని ప్రధాన సూత్రమని అన్నారు. విద్య, శిక్షణ కార్యక్రమాల ద్వారా సహకార స్ఫూర్తిని ప్రజల్లో పెంచాల్సిన అవసరముందన్నారు. జిల్లా సహకార అధికారి సింహాచలం మాట్లాడుతూ.. సహకార చట్టంపై సంఘాల సభ్యులు, ఉద్యోగులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. బోధన్ సొసైటీకి జిల్లాలోనే ప్రత్యేకత ఉందని, నాన్ క్రెడిట్ వ్యాపారాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారని వివరించారు. అన్ని సంఘాలు బోధన్‌ను ఆదర్శంగా తీసుకొని రుణాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. సదస్సుకు సొసైటీ చైర్మన్ ఉద్మీర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, సహకారశాఖ డిప్యూటీ రిజిస్ర్టార్ రాజేందర్‌రెడ్డి, సీఈవో ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.