బాల్కొండ(ముప్కాల్)/నందిపేట్/ కోటగిరి, నవంబర్ 17: పశుపెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ సూచించారు. ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో చేపట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. గ్రామంలోని 60 గేదెలకు టీకాలు వేశామన్నారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి గౌతమ్‌రాజ్, గోపాల మిత్ర ప్రణీత, మల్లయ్య, దేవా, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలంలోని తొండాకూర్ గ్రామంలో బుధవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. గ్రామంలోని 201 పశువులకు టీకాలు వేశారు. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని వైద్యులు రైతులకు సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి హన్మంత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి, దేవునిగుట్ట తండాలో ఇంటింటికీ వెళ్లి పశువులకు టీకాలు వేశామని డాక్టర్ సురేశ్‌కుమార్ తెలిపారు. రెండు గ్రామాల్లో మొత్తం 300 జీవాలు టీకాలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో పశువైద్య సహాయకులు శ్రీనివాసరావు, సుధీర్, బాబన్న పాల్గొన్నారు.