నిజామాబాద్ సిటీ, నవంబర్ 17: ఉపాధిహామీ పథకంలో కూలీల హాజరుశాతం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నర్సరీల్లో మట్టి సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్ తదితర పనులు సోమవారంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ నర్సరీల్లో పనులను వేగవంతం చేసి, ఒక్కో జీపీ పరిధిలో 20వేల మొక్కలకు తగ్గకుండా పెంచాలని సూచించారు. బృహత్ పల్లెపకృతి వనాల ఏర్పాటు పనులను పది రోజుల్లో పూర్తిచేయాలని, మినీ పార్కుల పనులను సోమవారం ప్రారంభించాలని స్పష్టంచేశారు. రెగ్యులర్ వర్క్‌తోపాటు ఎంపీడీవోలు వీటికోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఆదేశించారు. టీకా వేసుకోనివారిని గుర్తించి వ్యాక్సిన్ వేయాలని, సంబంధింత వివరాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేయాలని సూచించారు. వీసీలో అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్‌నాయక్, డీపీవో జయసుధ పాల్గొన్నారు.