స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి 4వ తేదీతో ముగియనుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ నెల 9వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో భాగంగా రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేశారు. వెనువెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిజామాబాద్ కలెక్టరేట్లో నామినేషన్లను స్వీకరిస్తారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ), ఫ్లయింగ్ స్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను రెవెన్యూ డివిజన్ల వారీగా నియమించారు. అదనంగా ఒక్కో డివిజన్‌కు వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ బృందాలు జిల్లాల వారీగా పనిచేయనున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున మొత్తం ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా మొదటిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
నిజామాబాద్, నవంబర్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కల్వకుంట్ల కవిత పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4తో పూ ర్తి కానుండడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 9న షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే ఎన్నికల ప్రవర్తనా నియమావ ళి అమల్లోకి వచ్చింది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎమెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నామినేషన్ల ప్రక్రియ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థుల నుంచి నిజామాబాద్ కలెక్టర్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 23వ తేదీ వరకు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు కొనసాగుతుంది. 24వ తేదీన స్క్రూటినీ, 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు 824 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
ప్రత్యేక బృందాలు ఏర్పాటు…
స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలను వెలువరించింది. ఈసీ ఆదేశాలతో రిటర్నింగ్ అధికారులు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలను పూర్తి చేసేందుకు పలు బృందాలను నియమించారు. రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు బృందాలు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెర లేపితే ఎన్నికల నిబంధనల మేరకు ప్రక్రియ నడిచే విధంగా ఆయా టీములు పని చేస్తాయి. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌లో మద్యం, డబ్బులకు పంపిణీకి ఆస్కా రం లేకుండా నిఘా బృందాలు పని చేస్తాయి. పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించేందుకు రెండు జిల్లాల్లో పలు బృందాలు నియమించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ), ఫ్లయింగ్ స్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను రెవెన్యూ డివిజన్ల వారీగా ఏర్పాటు చేశారు.అదనంగా ఒక్కో డివిజన్‌కు వీడియో సర్వేలెన్స్, వీడియో వ్యూయింగ్, అకౌంటింగ్ బృందాలు జిల్లాల వారీగా పని చేయబోతున్నాయి. పోలీసులు సైతం ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు మండలాల వారీగా ఠాణాలకు ఆదేశాలిచ్చారు.
పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడా…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఈసీ అనుమతించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 6 రెవెన్యూ డి విజన్లు ఉండడంతో నిజామాబాద్‌లో మూడు, కా మారెడ్డిలో మూడు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బాలుర కళాశాలను ఎంపిక చేశారు. ఇక్కడ 99 మంది ఎంపీటీసీలు, 8 మంది జడ్పీటీసీలు, కార్పొరేటర్లు 60 మందితో పాటు ఆరుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 173 మంది కేవలం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఓటు వేయనున్నారు. బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని మీటింగ్ హాలు లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ 75 మంది ఎంపీటీసీలు, 8 మంది జడ్పీటీసీలు, 37 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో మెంబర్‌ను కలిపితే మొత్తం 121 మంది ఓటు వేస్తారు. ఆర్మూ ర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికకు డి ప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పంచాయతీ రా జ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ ఎంపీటీసీలు 126 మంది, జడ్పీటీసీలు 11 మంది, కౌన్సిలర్లు 48 మంది, ఎ క్స్అఫీషియో మెంబర్ ఒకరితో మొత్తం 186 మం ది ఓటు వేయనున్నారు. అత్యధికంగా ఓటర్లు న్న పోలింగ్ కేంద్రం ఆర్మూర్ కావడం విశేషం. కా మారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేం ద్రాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయను న్నారు. 88 మంది ఎంపీటీసీలు, 9 మంది జడ్పీటీసీలు, 49 మంది కౌన్సిలర్లు, ఒకరు ఎక్స్ అఫీషి యో మెంబర్ మొత్తం 147 మంది ఓటర్లున్నారు. ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ కేం ద్రాన్ని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయ నున్నారు. 46 మంది ఎంపీటీసీలు, 4 జడ్పీటీసీ లు, 12 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్అఫీషియోతో మొత్తం 63 మంది ఓటర్లున్నారు. బాన్సువాడ రెవె న్యూ డివిజన్లో ఎంపీడీవో కార్యాలయంలో పో లింగ్‌ను నిర్వహించనున్నారు.101 మంది ఎం పీటీసీలు, 9 మంది జడ్పీటీసీలు, 19 మంది కౌన్సిలర్లు, ఒకరు ఎక్స్అఫీషియోతో 130 మంది ఓటర్లున్నారు. మొత్తం 820 మంది ఓటర్లున్నట్లుగా ఈ సీ ప్రాథమికంగా వెల్లడించింది.తుదిఓటరు జాబి తా ప్రకారం మార్పులు చేర్పులు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇందులో 376 మంది ఓటర్లు పురుషులు, 444 మంది ఓటర్లు మహిళలు ఉన్నారు.
కోలాహలం…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నోటిఫికేషన్ జారీ చేయడంతో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ లోనికి వెళ్లే ప్రవేశ మార్గం వద్ద ఇతరులను అనుమతించడం లేదు. రాజకీయ పార్టీల ప్రతినిధులెవరైనా వస్తే నామినేషన్ పత్రాలతో పరిమిత సంఖ్యలోనే రిటర్నింగ్ అధికారి చాంబర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా తొలిరోజు నామినేషన్లు ఒక్కటీ దాఖలు కాలేదు. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం కావడంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కనీసం ఇటు వైపు ఆలోచన చేయడం లేదు. త్వరలోనే అధినేత కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మొదటిరోజు నామినేషన్లు నిల్
నిజామాబాద్‌సిటీ, నవంబర్16 : స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల అ ధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం జా రీ చేశారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి ఈ నెల 23వరకు నామినేషన్ల స్వీకరణ, 24న స్క్రూటినీ, 26న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్10న పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కలెక్టరేట్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు రాలేదని అధికారులు తెలిపారు.