రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండానే ఎంటర్ ప్రైజెస్‌ల పేరిట పలువురు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. సామాన్యుల ఆశలను సొమ్ము చేసుకుంటున్నారు. నెలనెలా చెల్లింపులతో తక్కువ ధరకే విలువైన వస్తువులను అందిస్తామని లక్కీ డ్రాల పేరిట మోసగిస్తున్నారు. కొన్ని నెలల పాటు నడిపిన తర్వాత బిచానా ఎత్తేస్తున్నారు. బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి.
శక్కర్‌నగర్, అక్టోబర్ 31 : బోధన్ పట్టణ కేంద్రంతో పాటు, డివిజన్లోని పలు మండల కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎంటర్ప్రైజెస్ పేరిట దుకాణాలు ప్రారంభించి సామాన్య ప్రజలకు విలువైన వస్తువుల ఆశ చూపి నెలానెలా డబ్బులు వసూలు చేసి అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తక్కువ డబ్బులతో మంచి కానుకలు వస్తున్నాయని ఆశపడి ప్రజలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఎటువంటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు లేకుండా ప్రారంభిస్తున్న ఈ వ్యాపారాలను అర్ధాంతరంగా మూసివేస్తున్నా రు. విలువైన వస్తువులు తక్కువ ధరకు వస్తాయన్న ఆశతో డబ్బులు కట్టిన సామాన్యులు లబోదిబోమంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని తెలివైన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల బోధన్ పట్టణ శివారులో ఓ ఎంటర్ప్రైజెస్ వారు డ్రా నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు బోధన్ పట్టణ సీఐ రమన్ సిబ్బందితో దాడి జరిపి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట, మట్కా జోరు..
పేకాట, మట్కా జూదాలు సైతం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. బోధన్ పట్టణంతో పాటు, మండలాల్లోని పలు గ్రామాలు, అటవీప్రాంతాల్లో కొనసాగుతున్న పేకాట కేంద్రాలు నిర్వాహకులకు వరంగా మారగా, పేకాట రాయుళ్ల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పేకాట కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు కొంత మంది, పోలీసు శాఖలో పనిచేసే కిందిస్థాయి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని తమ అడ్డాల గురించి ఎవరైనా సమాచారం అందిస్తున్నారా? అందిస్తే అధికారులు ఎవరైనా దాడులకు వస్తున్నారా? అనే విషయంలో కూడా జాగ్రత్తలు చేపడుతున్నారు. బోధన్ పట్టణ శివారులోని పేకాట కేంద్రాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఓ కేంద్రం పై జరిపిన దాడిలో పోలీసులు భారీ మొత్తంలో డబ్బులను రికవరీ చేశారు. పేకాట ఆడవద్దని హెచ్చరించిన సంఘటనలో రాకాసీపేట్ ప్రాంతంలో ఏకంగా ఓ హత్య జరిగింది. పేకాడుతున్న వ్యక్తులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ ప్రాంతం, మండలంలోని సాలూరా గ్రామ శివారులో, మండలంలోని ఓ గ్రామ పంటపొలాల్లో ఏకంగా పేకాట కేంద్రాలు పెద్దమొత్తంలో కొనసాగుతున్నట్లు సమాచారం.
రెచ్చిపోతున్న మట్కారాయుళ్లు
బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాలకు పక్కనే మహారాష్ట్ర ఉండడంతో మట్కా జూదానికి అలవాటు పడుతున్నారు. నిత్యం మట్కా కోసం ఒక్కో మండలం నుంచి సుమారు లక్ష నుంచి 1.5లక్షల రూపాయల వరకు జూదరులు తగలేస్తున్నట్లు సమాచారం. మట్కాలో డబ్బులు పోయి ఆస్తులు అమ్ముకుని ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మట్కాకు కల్లు దుకాణాలు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపణలున్నాయి. బోధన్ డివిజన్లోని ఓ మండలానికి చెందిన గ్రామం మట్కాకు అడ్డాగా మారింది. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు వారు ఎంచుకున్న ప్రాంతానికి చేరుకుని అక్కడకు వచ్చే బుకీకి ఎంపిక చేసిన నంబర్లు, డబ్బులు చెల్లించేందుకు పలువురు వస్తారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న మట్కా, పేకాట జూదాలను ఆపేందుకు పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. మట్కా నంబర్లు సేకరించి బుకీలకు అప్పగించి వచ్చే సమయంలో ఇటీవలే ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
లక్కీడ్రాల పేరిట మోసం చేస్తే కఠి చర్యలు
బోధన్ పట్టణంలో, శివారులో కొనసాగుతున్న పేకాట కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఎంటర్ప్రైజెస్ల పేరిట లక్కీడ్రాలు నిర్వహిస్తే చర్యలు చేపడతాం. ఇటీవలే బోధన్ శివారులో ఓ లక్కీడ్రా నిర్వాహకులపై దాడి జరిపి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాం. పూర్తి సమాచారం అందితే మరిన్ని లక్కీడ్రా కేంద్రాలను సైతం మూసివేసి, సదరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చర్యలు చేపడతాం.
-రమన్, పట్టణ సీఐ, బోధన్