రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మరో కీలకమైన అడుగు ముందుకేసింది. హైదరాబాద్‌లో విజయవంతమైన బస్తీ దవాఖానల మాదిరిగా పల్లెల్లో పల్లె దవాఖానల ఏర్పాటుకు సర్కారు సమాయత్తం అవుతున్నది. ఆరోగ్య ఉప కేంద్రాలనే పల్లె దవాఖానలుగా మారుస్తూ ప్రజలకు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని అందించే కార్యక్రమం త్వరలో ఆరంభం కాబోతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 507 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా.. ప్రభుత్వం వీటిని పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25.51 లక్షల జనాభా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 47 వరకు ఉన్నాయి. నిత్యం దవాఖానల్ల్లో 10వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. పల్లె దవాఖానలు ఏర్పాటైతే సేవలు మరింత చేరువకానున్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సౌకర్యాలను కల్పిస్తున్నది. అధునాతన సాంకేతిక పరికరాలను తీసుకు వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బస్తీ దవాఖానానలు తరహాలోనే ఇవి పని చేస్తాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాల్లో కేవలం నర్సులు మాత్రమే రోగులకు ఆరోగ్య సూచనలు అందిస్తున్నారు. ఇక నుంచి వైద్యులు సేవలందించే భారీ ఆరోగ్య కార్యక్రమం ముందుకు రానున్నది. దీనికోసం అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్యులు, నర్సులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి తగిన మందులు కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గ్రామీణ వైద్యుల నియామకాన్ని సైతం చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో 94 మంది మెడికల్ ఆఫీసర్లను పల్లె దవాఖానల కోసం నియమించబోతున్నారు. కామారెడ్డి జిల్లాలోను పల్లె దవాఖానల ఏర్పాటు కోసం వైద్యుల నియమాకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అదే విధంగా వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనకు రూ.10వేల కోట్లతో కార్యాచరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం హర్షించదగిన పరిణా మం. రాష్ట్రంలో కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటు కానున్నాయి. కామారెడ్డి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ వచ్చే రెండు సంవత్సరాల్లో ఏర్పాటు అయ్యేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆరోగ్య భద్రత లభించనున్నది.
సేవలు ఇలా ఉండనున్నాయి…
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తారు. ప్రాథమిక చికిత్స, మాతా శిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులకు వైద్య సేవలు అందనున్నాయి. 57 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రోజూ అక్కడే నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని పరీక్షా కేంద్రాలకు పంపుతారు. మరుసటి రోజు ఆ నమూనాల ఫలితాలు తిరిగి పల్లె దవాఖానలకు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులతో పాటు ఇతర మందులు సైతం పల్లె దవాఖానల్లోనే అందించనున్నారు. వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రోగులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలోనూ సుదూర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ప్రస్తుతం మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే వైద్యులు అరకొరగా అందుబాటులో ఉంటున్నారు. గ్రామీణులకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏఎన్ఎంలే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్ వైద్యులను నియమించబోతున్నది. తద్వారా మేలైన వైద్య సేవలు స్థానికంగా ఆరోగ్య ఉప కేంద్రాల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 507 ఉప కేంద్రాలు…
త్వరలోనే ఊరూరా పల్లె దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 507 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా ప్రభుత్వం వీటిని పల్లె దవాఖానలుగా తీర్చిదిద్దనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా గ్రామాగ్రామాన ఓ దవాఖాన ఏర్పాటు చేసి వైద్య సేవలు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నిర్మాణ, నిర్వహణ నిధులకు సంబంధించి ఎలాంటి కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25.51 లక్షల జనాభా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 47 వరకుఉన్నాయి. నిత్యం దవాఖానల్ల్లో 10వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. పల్లె దవాఖానలు ఏర్పాటు అయితే పేదలపై వైద్య భారం తగ్గనున్నది. ప్రస్తుతం గ్రామాల్లో కొంతమంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఇష్టానుసారంగా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూ అమాయకులను నట్టేటా ముంచుతున్నా రు. కార్పొరేట్ దవాఖానలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలను అనవసరపు భయాలతో ప్రైవేటు హాస్పిటల్లో అడ్మిట్ చేయించి రూ.లక్షలు వసూ లు చేస్తున్నారు. పల్లె దవాఖానలు వస్తే ఇలాంటి దోపిడీకి అడ్డుకట్ట పడనున్నది.