ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని సేకరిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ధాన్యం సేకరణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఆధ్వర్యంలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు నిరంతరం రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా కృషి చేస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఆయా స్థాయిలోని కమిటీలు ముందుకొచ్చి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించి రైతుకు మేలు చేసేలా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. నిజామాబాద్ జిల్లాలో 10.66 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 5.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 343 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సగం వరకు కేంద్రాలను ప్రారంభించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ యంత్రాంగానికి అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నారు.
నిజామాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం సేకరణ ప్రక్రియ చకచకా సాగుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల ఆధ్వర్యంలోని మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు నిరంతరం రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా కృషి చేస్తున్నా యి. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఆయా స్థాయిల్లోని కమిటీలు ముందుకొచ్చి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించి రైతుకు మేలు చేసేలా ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. మరోవైపు ఉభయ జిల్లాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. రోజువారీగా రెండు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడుతూ వివరాలు ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని సంబంధిత శాఖలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ధాన్యం సేకరణ అనంతరం కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు లారీల ద్వారా రవాణా చేసేందుకు వాహనాల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గన్నీ సంచుల కొరతను అధిగమించేలా ప్రణాళికలు రచించారు.
రాష్ట్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయం..
ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రైతు పొట్ట కొట్టేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తోంది. రైతులు పండించిన పంటలను సేకరించకుండా ఆటంకాలు సృష్టిస్తోంది. బాయిల్డ్ రైస్, రారైస్ పేరిట విధిస్తున్న నిబంధనలతో రాష్ట్ర రైతు లు ఆగమాగమవుతున్నారు. రైతు అనుకూల నిర్ణయాలతో రికా ర్డు స్థాయిలో రాష్ట్రంలో ధాన్యం పండుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీడు భూములు సాగులోకి రావడంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా దిగుబడులు భారీగా పెరిగాయి. పంట ఉత్పత్తులను భారత ఆహార సంస్థ ద్వారా రాష్ర్టాల నుంచి సేకరించాల్సిన కేంద్రం ఒక్కసారిగా విధిస్తున్న నిబంధనల ఫలితంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సీఎం కేసీఆర్ నేరుగా కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. రైతుల కోసం రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేసి ధాన్యం కొనుగోళ్లకు రూట్ క్లియర్ చేసేలా ప్రయత్నాలు చేశారు. రూ.వేల కోట్లు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్న ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించకపోతే జరిగే పరిణామాలను కూలంకషంగా ప్రధాని మోదీ, వ్యవసాయ శాఖ మంత్రులతో పాటు ఎఫ్‌సీఐ పెద్దలకు వివరించారు. ఎట్టకేలకు కేంద్రం చేసేది లేక రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ధాన్యంపై విధించిన ఆంక్షలు కాసింత సడలించింది. కేంద్రం అనేక అడ్డుంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు మేలు కోసం ధాన్యం సేకరణకే ముందడుగు వేసింది.
రికార్డు స్థాయిలో దిగుబడులు…
2021 వానకాలంలో రైతులు పండించిన ధాన్యం ఉత్పత్తులు ఆల్ టైం రికార్డుకు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈసారి ఉభయ జిల్లాల్లో వరి దిగుబడి భారీగా వచ్చే అవకాశాలున్నట్లుగా వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 10లక్షల 66వేల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా ఉంది. కామారెడ్డి జిల్లాలో 5.50లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం రావొచ్చని అధికార యంత్రాంగం పరిశీలనలో తేలింది. ధాన్యం రాక అంచనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ఎక్కడికక్కడ ప్రారంభించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచే జుక్కల్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లో వరి కోతలు మొదలవగా.. ప్రస్తుతం జిల్లా అంతటా వరి రాశులు కనిపిస్తున్నాయి. కుప్పలుగా పోసిన ధాన్యాన్ని ఆయా గ్రామాల్లోనే ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలిస్తున్నారు. పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 343 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం వరకు కేంద్రాలు తెరిచారు.
రైతు ఖాతాల్లో నగదు జమ…
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించిన రైతులకు నగదు చెల్లింపుల విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేశారు. రైతు చేతికి నగదు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఏడేండ్లుగా డిజిటల్ చెల్లింపులు చేస్తోంది. అక్రమార్కులకు తావు లేకుండా నేరుగా పట్టాదారు పాసు పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలోనే మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నగదును జమ చేస్తున్నారు. ఈ ప్రక్రియను కనిష్ఠంగా 48 గంటలు గరిష్ఠంగా 72 గంటల్లోనే పూర్తి చేసే విధంగా కొనుగోలు కేంద్రాల సిబ్బందికి తర్ఫీదునిచ్చారు. కేంద్రాల వద్ద ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను తీసుకుంటున్నా రు. ఇదిలా ఉండగా కడ్తా సమస్య లేకుండా ఉండేందుకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వరి పంట కోత సమయంలో కూలీలతో కాకుండా హార్వేస్టర్ ద్వారా మార్పిడి చేయించాలని సూచిస్తున్నారు. హార్వేస్టర్ ద్వారా కోత సమయంలోనే ఫ్యాన్ వేగాన్ని ఎక్కువగా పెట్టించడం ద్వారా చెత్త రావడానికి ఆస్కారం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే హార్వేస్టర్ డ్రైవర్లు, టెక్నీషియన్లకు వ్యవసాయ శాఖ నుంచి సంపూర్ణ అవగాహన కల్పించారు.
కొనుగోళ్లలో వేగం పెంచాం…
నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు జోరుగా మొదలయ్యా యి. అంతటా పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నది. అన్ని శాఖల ను సమన్వయం చేసుకుంటూ వానకాలం కొనుగోళ్లను సా ఫీగా పూర్తి చేస్తాం. ఇప్పటికే ముందస్తుగా అనుకున్న కొనుగోలు కేంద్రాల్లో చాలా వరకు ప్రారంభించాం. ధాన్యం రాక ను అనుసరించి కేంద్రాలను తెరిచి పంటను కొంటున్నాం.