ఎడపల్లి (శక్కర్‌నగర్), నవంబర్ 6: అనాథలు, నిరుపేదల కష్టాల్లో తోడుగా మేమున్నామంటూ ‘డైహార్డ్ ఫ్రెండ్స్’ మిత్ర బృందం భరోసా కల్పిస్తున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువ మిత్రు లు బృందంగా ఏర్పడి గ్రామంలోని నిరుపేదలు, అనాథలకు తోడుగా నిలిచేందుకు సంకల్పించారు. ఇందుకుగాను ఓ కార్యాచరణ రూపొందించారు. గ్రామంలో ముందుగా అనాథలు, నిరుపేద కుటుంబాల అంత్యక్రియలకు సాయం చేయాలనే ఉద్దేశంతో గ్రూపును ఏర్పాటు చేశారు. అదేవిధంగా దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కూడా సాయమందించి కాపాడాలని భావించారు. అనతికాలంలోనే ఇప్పటివరకు సు మారు పది కుటుంబాలకు తమవంతు సాయం అందజేసి బాధితులకు బాసటగా నిలిచారు. గ్రామం చిన్నది కావడం, ఎక్కువ మంది నిరుపేదలే ఉండడం, మిత్రబృందంలో పలువురు ఉద్యోగులతోపాటు రోజువారీ పనులు చేసి ఉపాధి పొందుతున్న యువకులు సైతం భుజం కలిపి ముందుకు వచ్చారు. దీంతో ఈ బృందం మండలంలో ఆదర్శంగా మారుతున్నది. ఈ యువకులు చేస్తున్న కార్యక్రమానికి గ్రామ పెద్దలు సైతం తమవంతు సాయం అందజేశారు. ఓ కార్యక్రమానికి ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ కూడా తనవంతు సాయం అందించారు.
మచ్చుకు కొన్ని సేవలు..
గ్రామానికి చెందిన తెనుగు నర్సయ్య కుమారుడు సాయిలు అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన దవాఖానలో చికిత్స పొందుతున్నప్పుడు సాయం అందించాలనే ఉద్దేశంతో వారి కుటుంబానికి రూ.50వేల వరకు అందించారు. గ్రామంలో కళ్యాణి అనే యువతి భర్తను వదిలి తల్లివద్ద ఉంటుండగా, తల్లి మృతి చెందడంతో ఆమె అంత్యక్రియల కోసం రూ.12వేలు అందజేశారు. పారిశుద్ధ్య కార్మికునిగా విధులు నిర్వహించే బాబ య్య భార్య ఇటీవల బాబుకు జన్మనివ్వగా బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో సదరు బాబును కాపాడేందుకు రూ. 30వేల వరకు అందజేశారు. దురదృష్టవశాత్తు సదరు బాబు మృతి చెందగా, వారు జమచేసిన డబ్బులను ఆయనకు అందించారు. నాలుగు రోజల క్రితం మంగళి నర్సుబాయి అనే మహిళ మృతి చెందగా ఆమె కుటుంబానికి రూ.20వేలను అందించారు.
పేద కుటుంబాలకు బాసటగా నిలవాలనే..
పేద కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ‘డైహార్డ్ గ్రూప్’తో కలిసి సేవ చేయడం సంతోషంగా ఉంది. సర్పంచ్, సభ్యులందరూ అందిస్తున్న సహకారంతో వెంటనే స్పందిస్తూ ప్రతి ఒక్కరం సహకరిస్తున్నాం. గ్రూపులో ఉన్న వారూ మధ్యతరగతి కుటుంబాలే కావడంతో బాధలు గుర్తించి బాసటగా నిలవాలని ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం.
-జక్కు శ్రీకాంత్, ప్రైవేట్ ఉద్యోగి, పోచారం
మా నాన్న స్ఫూర్తితో..
పోచారం గ్రామంలో మా నాన్న అశోక్‌సింగ్ చేసిన సేవలు, గ్రామస్తులు అందించిన సహకారంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. నాన్న దురదృష్టవశాత్తు మానుంచి దూరం అయ్యారు. గ్రామంలో సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్న మిత్రుడు కోల ఇంద్రకరణ్ సలహా మేరకు నాకు కూడా గ్రామంలో సేవ చేసేందుకు అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి నడుం బిగించిన మా మిత్ర బృందానికి కృతజ్ఞతలు.
ఆదుకోవాలనే తపనతో..
గ్రామం చిన్నది కావడం, ఎక్కువ మంది నిరుపేదలే కావడంతో తోచిన సాయం చేయాలనే సంకల్పంతో, నా మిత్రులతో చర్చించి ఈ గ్రూపును ఏర్పాటు చేశా. అయితే, ఈ గ్రూపులో ఇప్పటివరకు ఇరవైమంది మిత్రులు, కుటుంబ సభ్యులతోపాటు మేము చేస్తున్న సేవలను గుర్తించి గ్రామ పెద్దలు సైతం సహకరిస్తున్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ సేవలు కొనసాగించాలని భావిస్తున్న.