కరివేపాకే కదా అని తీసిపారేయకండి. ఆ కరివేపాకే ఇప్పుడు ఎంతో మంది రైతుల్ని లాభాలబాట పట్టిస్తున్నది. తక్కువ పెట్టుబడితో కరివేపాకు సాగు చేసి ఎక్కువ ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల రైతులు. కరివేపాకునే నమ్ముకొని లాభాల గుబాళింపును ఆస్వాదిస్తున్నారు ఇక్కడి రైతులు. ఏటా ఖర్చులన్నీ పోను అధిక లాభాలు వస్తుండడంతో కరివేపాకు సాగునే ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నారు.
కరివేపాకు సాగు రైతులను లాభాలబాట పట్టిస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు మాక్లూర్ మండల రైతులు. కృష్ణానగర్, ముల్లంగి(బీ), శాంతినగర్ నుంచి కరివేపాకు ఇతర రాష్ర్టాలకూ ఎగుమతి అవుతున్నది.
కరివేపాకు సాగు లాభాదాయకం..
ఒకసారి విత్తనాలు చల్లితే పంటను చెరిపివేసే వరకు కరివేపాకు చెట్లు అలాగే ఉంటాయి. పంట సస్యరక్షణ కోసం కేవలం మందులు వాడితే సరిపోతుంది. వేసిన ఆరు నెలల్లో పంట చేతికి వస్తుంది. సంవత్సర కాలంలో మూడు లేదా నాలుగు సార్లు కోసుకోవచ్చు. మొదట్లో మొక్కలను సంరక్షించుకుంటే పెరిగిన తర్వాత ఎలాంటి ఖర్చులుండవు. ఎన్నేండ్లయినా మొదటిసారి వేసిన విత్తనాలతోనే పంట చేతికి వస్తుంది. ప్రతిసారీ దుక్కి దున్నడం, విత్తనాలు వేయడం, అధిక మొత్తంలో ఎరువులు వాడడం అవసరముండదు. ఖర్చులు పోనూ ఎకరానికి రూ.50వేలకు పైగా ఆదాయం వస్తుంది. మొదటిసారి విత్తనాల కొనుగోలు కోసం ఎకరానికి రూ.20వేలు, కూలీల కోసం మరో రూ.5వేల చొప్పున ఖర్చు చేయాల్సి ఉంటుంది.
విజయవాడ నుంచి విత్తనాల సరఫరా..
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపంలో ఉన్న వడ్లపూడి నుంచి విత్తనాల సరఫరా జరుగుతున్నది. రైతులు నేరుగా వడ్లపూడి వెళ్లి కొనుగోలు చేస్తారు. ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు మధ్యవర్తుల ద్వారా నమ్మకంతో ఇక్కడి రైతులకు విక్రయిస్తారు. విత్తనాల విక్రయంలో ఎలాంటి అవకతవకలు జరుగవు. నాణ్యతతో కూడిన విత్తనాలను సరఫరా చేస్తారు. అక్కడ తప్ప మరో ప్రాంతంలో కరివేపాకు విత్తనాలు దొరకవు. వడ్లపూడి విత్తనాలే సరైనవని రైతులు చెబుతున్నారు.
నీటి వాడకం చాలా తక్కువ..
పదేండ్లుగా కరివేపాకు పండిస్తున్న. నీటి వాడకం చాలా తక్కువ. ఆరుతడి పంటగా వేసుకోవచ్చు. విద్యుత్ వాడకం కూడా చాలా తక్కువే. లోకల్ బేరకాళ్లు ఏడాదిలో మూడుసార్లు కోసుకొనిపోతారు. మార్కెటింగ్ సమస్య ఉండదు. ఏడాదిలో నాలుగుసార్లు కోస్తున్నాం. కరివేపాకుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒకసారి కష్టపడి పంటను సాగుచేస్తే ఎలాంటి కష్టాలుండవు. వరి కన్నా చాలా లాభాదాయకం.