నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 3: దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా చేయూతనందించి ప్రోత్సహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లాలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వర్నిలో ఎంఈవో శాంతకుమారి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో దుర్గాప్రసాద్ బహుమతులను అందజేశారు.
ధర్పల్లి భవిత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఎంపీపీ సారిక పుస్తకాలు, పెన్నులు, ఆట వస్తువులను అందజేశారు. శుభోదయం పాఠశాలలో ఐకేపీ ఆధ్వర్యంలో చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఐకేపీ సిబ్బంది ఆలస్యంగా హాజరుకావడంపై డీఆర్డీఏ పీడీ చందర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. సాయిబాబా ఆలయంలో దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు కుంట మహిపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షురాలు కవితారెడ్డి కేక్ కట్ చేశారు. దివ్యాంగులకు 10 శాతం డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సిరికొండలో విద్యార్థులకు డీఆర్డీవో చందర్‌నాయక్ బహుమతులను అందజేశారు. జక్రాన్‌పల్లి ఎంపీపీ డీకొండ హరిత దివ్యాంగ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ మిఠాయిలను పంపిణీ చేశారు. భీమ్‌గల్‌లోని భవిత కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీ చౌట్పల్లి రవి హాజరై వివిధ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కమ్మర్పల్లి భవితకేంద్రంలో చిన్నారులకు ఎంఈవో ఆంధ్రయ్య బహుమతులను అందజేశారు. కమ్మర్‌పల్లిలో ఎంపీపీఎస్ విద్యార్థులకు టై, బెల్టులను అందజేసి, మధ్యాహ్న భోజన సమయంలో ప్రతి శుక్రవారం అరటిపండ్లను అందజేస్తూ.. పాఠశాలకు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయిస్తానని హామీ ఇచ్చిన కుమ్మరి మహిపాల్‌ను ఈ సందర్భంగా సత్కరించారు. బాల్కొండలోని భవిత కేంద్రంలో జడ్పీటీసీ దాసరి లావణ్య చిన్నారులకు బహుమతులను అందజేశారు. ముప్కాల్‌లోని వికలాంగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ రోజాకు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు. వేల్పూర్ ఎమ్మార్సీ భవనంలో దివ్యాంగుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జలేందర్‌ను ఎంఈవో వనజారెడ్డి సన్మానించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ భవిత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో గణేశ్‌రావు, ఎడపల్లిలో ఎంఈవో రామారావు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. మోర్తాడ్ భవిత పాఠశాలలో చిన్నారులకు క్రీడలను నిర్వహించగా.. ముఖ్యఅతిథులుగా హాజరైన ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో ఆంధ్రయ్య, బోధన్‌లోని భవిత సెంటర్లో చిన్నారులకు తహసీల్దార్ గఫార్‌మియా బహుమతులను అందజేశారు. మాక్లూర్ మండలం మాందాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈవో రాజగంగారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుధారాణి పాల్గొన్ని దివ్యాంగులు అధైర్య పడొద్దని సూచించారు.