నిజామాబాద్‌సిటీ, డిసెంబర్ 2 : పంటమార్పిడి, యా సంగి సీజన్లో ఏ పంటలు సాగుచేస్తే బాగుంటుందనే దానిపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతువేదికల ద్వారా శనివారం నుంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రైతులకు అర్థమయ్యే రీతిలో యాసంగి సాగుపై వివరించాలన్నారు. నీటివసతి, 24గంటల విద్యుత్ సరఫరా, అవసరాలకు అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచడంతో వానకాలం సీజన్లో 3.87లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, తద్వారా 7.87 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని తెలిపారు. రైతులు వరి సాగుచేసి ఇబ్బందులకు గురికాకుండా ఏ పంటలు సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందో వివరించాలన్నారు. గ్రామం యూనిట్‌గా చేసుకొని, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని దొడ్డు, సన్నరకాలను, మిగతా సగం భూముల్లో ఇతర పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. చెరువుల కింద చేపల పెంపకం, మక్కజొన్న, వేరుశనగ, ఆయిల్ పామ్ సాగుచేయవచ్చని శాస్త్రవేత్తలు డాక్టర్ నవీన్‌కుమార్, ఏడీఏ జావిద్ హుస్సేన్ తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిం ద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, వ్యవసాయశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వదంతులను నమ్మవద్దు
ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు సుమారు లక్షన్నర మంది వరకు ఉంటారని, ఒకవేళ కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిచెందితే వ్యాక్సిన్ తీసుకోనివారు ఇబ్బందులు పడతారన్నారు. వ్యాక్సిన్‌పై వదంతులను నమ్మకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు.