వార్షిక తనిఖీల్లో భాగంగా దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మంగళవారం కామారెడ్డి- ముథ్కేడ్ సెక్షన్లో పర్యటించారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన నవీపేట్ నుంచి కామారెడ్డి వరకు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ.. పురోగతిలో ఉన్న పనులను పరిశీలిస్తూ ముందుకుసాగారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. కామారెడ్డి, ఇందల్వాయి స్టేషన్లను పరిశీలించారు. నిజామాబాద్, డిచ్‌పల్లిలో పలు అభివృద్ధి పనులను జీఎం ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.
నిజామాబాద్‌సిటీ/ డిచ్పల్లి/ ఇందల్వాయి/ కామారెడ్డి, నవంబర్ 2:దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన ప్రత్యేక రైలులో ముద్కేడ్-మేడ్చల్ సెక్షన్ పరిధిలో పర్యటించారు. నవీపేట్, జాన్కంపేట్ సెక్షన్ మధ్య లెవల్ క్రాసింగ్ గేట్‌ను పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని ప్రయాణికుల వసతులపై సమీక్షించి స్టేషన్ పరిసరాలను, మియావాకీ చెట్ల పెంపకాన్ని, స్టేషన్ రికార్డుల డిజిటలైజేషన్ తదితర వాటిని తనిఖీ చేశారు. రన్నింగ్ రూంలోని డైనింగ్ హాల్‌ను ప్రారంభించి గూడ్స్ ప్లాట్‌ఫాం అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేశారు. ఫిర్యాదుల పరిష్కార కేంద్రం ‘కైసా హో’ విభాగాన్ని సమీక్షించారు. అనంతరం డిచ్పల్లి స్టేషన్‌కు చేరుకొని గూడ్స్ రైల్వేప్లాట్ఫాంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నిజామాబాద్‌లో వ్యాపార కార్యకలాపాలు పెరుగడంతో ప్రత్యామ్నాయంగా డిచ్‌పల్లిలో గూడ్స్‌ను గతేడాది ప్రారంభించామన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి స్టేషన్లో పర్యటించిన జీఎం గజానన్ మాల్యా ప్లాట్‌ఫాం పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇందల్వాయిలో ఆపాలని విన్నవించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇందల్వాయి, సిర్నాపల్లి, కామారెడ్డి సెక్షన్లో ట్రాకులు, వంతెనలు, రోడ్ అండర్ బ్రిడ్జిని, లెవల్ క్రాసింగ్ గేట్‌ను పరిశీలించారు.