బోధన్, డిసెంబర్ 1: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేసి అక్కడ రోగులకు అందుతున్న సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇమ్యూనైజేషన్ కోసం వచ్చిన బాలింతలు, గర్భిణులు గంటల తరబడి వేచిఉండడం, వారు కూర్చునేందుకు బెంచీలు లేకపోవడం, తాగునీటి సౌకర్యం కల్పించకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో దవాఖాన అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. వెంటనే దవాఖానలో వైద్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఇటీవల కాలంలో వైద్యుల మధ్య సమన్వయం లోపించింది. ఒకరిపై ఒకరికి జెలసీలు పెగిగాయి.. ఇది మంచి పద్ధతి కాదు.. రోగులకు కనీస సౌకర్యాలు లేవు.. ఇదేనా మనం చూపించే మానవీయత..:’ అంటూ వారికి చురకలు వేశారు. ‘మీకేం కావాలో చెప్పండి.. రోగులు ఇబ్బందులు పడకుండా చేయండి’ అంటూ దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ సందీప్‌కు సూచించారు. దవాఖానలో ఏర్పాటుచేయాల్సిన ఐసీయూ, ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టం తదితర సౌకర్యాలపై రోగులతో చర్చించారు. బోధన్ దవాఖానకు ప్రభుత్వం 15 పడకల ఐసీయూను మంజూరుచేసిందని, ఈ ఐసీయూను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇమ్యూనైజేషన్, ఇతర వైద్య సేవల కోసం ఎలక్ట్రానిక్ టోకెన్ సిస్టం ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. దవాఖానలో ప్రస్తుతం ఒకే ఒక గైనకాలాజిస్ట్ ఉన్నారని, మరో ఇద్దరు గైనకాలాజిస్టుల నియామకం కోసం కృషిచేస్తామన్నారు. పట్టణంలోని శక్కర్‌నగర్‌లో త్వరలో అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభిస్తామని, ఇది ఆచన్‌పల్లి, శక్కర్‌నగర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్‌రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ విద్య, ప్రభుత్వ జిల్లా దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ సందీప్, రెండో ఆర్ఎంవో డాక్టర్ రహీం, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, గోగినేని నరేంద్రాబాబు, ఎంఏ రజాక్, గుమ్ముల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
స్వీపింగ్ యంత్రం ప్రారంభం
బోధన్ బల్దియా రూ.82లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను ఎమ్మెల్యే షకీల్ బల్దియా చైర్పర్సన్ తూము పద్మ శరత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, టీఆర్ఎస్ బోధన్ పట్టణ, మండల అధ్యక్షులు రవీందర్ యాదవ్, గోగినేని నరేంద్రబాబు, నాయకులు ఎంఏ రజాక్, పిల్లకుంట్ల గంగాధర్‌గౌడ్, బుద్దె రాజేశ్వర్, అబ్దుల్ రహమాన్, కౌన్సిలర్లు బెంజర్ గంగారాం, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.